సాక్షి, ముంబై : బీఆర్పీ–బహుజన్ మహాసంఘ్, ఎంఐఎం పార్టీలు కూటమిగా ఏర్పాడ్డాయి. ఈ మేరకు ప్రకాశ్ అంబేడ్కర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేతులు కలిపారు. వచ్చే సంవత్సరం జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు కలిసే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఔరంగాబాద్‌లో శనివారం ఎంఐఎం ఎమ్మెల్యే సయ్యద్ ఇంతియాజ్ జలీల్, బీఆర్పీ–బహుజన్ మహాసంఘ్ మాజీ ఎమ్మెల్యే హరిదాస్ భదే, అమిత్ భుయింగల్ వెల్లడించారు. కాగా, కూటమి మొదటి సభ గాంధీ జయంతి పురస్కరించుకుని అక్టోబర్ రెండో తేదీన ఔరంగాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిసింది.
దళిత కార్డుకు చెక్!
స్థానిక సంస్థల ఎన్నికలు మొదలుకుని లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో దళితుల ఓట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ, ప్రకాశ్ అంబేడ్కర్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడంతో దళితుల ఓట్లపై ఆధారపడిన పార్టీలకు పెద్ద దెబ్బ తగిలనట్‌లైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎలాంటి ఎన్నికలు వచ్చినా ముందుగా ముస్లింలు, దళితుల ఓట్లపై చర్చ జరుగుతుంది. కేంద్రంలో సామాజిక, న్యాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న రామ్‌దాస్ ఆఠావలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) ప్రస్తుతం అధికార పార్టీ బీజేపీతో ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే జోగేంద్ర కవాడేకు చెందిన పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ (పీఆర్పీ) కాంగ్రెస్‌తో ఉన్నారు. అలాగే రాజేంద్ర గవయి ఏ పార్టీతో ఉంటారో ఇంకా స్పష్టం కాలేదు. గంగారాం ఇందిసే, అర్జున్ డాంగ్లే, మాజీ కార్పొరేటర్ మనోజ్ సంసారే తదితర రిపబ్లికన్ నాయకుల వర్గం బీజేపీ హటావ్ నినాదంతో ఒక్కటవ్వాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఏడాదిలోనే ఎదుగుదల..
ప్రకాశ్ అంబేడ్కర్‌కు చెందిన బీఆర్పీ–బహుజన్ మహాసంఘ్‌తో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పొత్తు పెట్టుకోవడం వల్ల దళిత, ముస్లిం ప్రజల ఐక్యత బలపడే అవకాశం ఉంది. ముంబైలోని దాదర్‌లో ఉన్న అంబేడ్కర్ భవనం కూల్చివేసిన సంఘటన తరువాత ప్రకాశ్ అంబేడ్కర్ చర్చల్లోకి వచ్చారు. ఒక పటిష్టమైన దళిత నాయకునిగా ఆయనకు గుర్తింపు లభించింది. అనంతరం భీమా కోరేగావ్ హింసాత్మక సంఘనటల నేపథ్యంలో మహారాష్ట్ర బంద్, సంభాజీ భిడేకు వ్యతిరేకంగా ఆందోళన, నగర నక్సలైట్ల అరెస్టులు తదితర సంఘటనల తరువాత ప్రకాశ్ అంబేడ్కర్ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌తో ఎంఐఎం పొత్తు పెట్టుకోవడంవల్ల దీని లబ్ధి ఎవరు పొందుతారనే అంశంపై అందరి దృష్టి పడింది. ప్రకాశ్ అంబేడ్కర్‌కు చెందిన బీఆర్పీ–బహుజన్ మహాసంఘ్‌కు చెందిన బలిరాం శివస్కర్ అసెంబ్లీలో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నారు. అయన అకోలా జిల్లాలోని బాలాపూర్ నియోజక వర్గం నుంచి ఎన్నికయ్యారు.
బీజేపీకి లబ్ధి చేకూరేనా!
ఓట్లు చీల్చడానికి బీఆర్పీ–బహుజన్ ఇంతకుముందు ఎన్నికల బరిలోకి దిగినప్పుడల్లా బీజేపీకి లాభించిందని ఫలితాల తరువాత స్పష్టమైంది. మరోపక్క ఓవైసీ కూడా బీజేపీకి లబ్ధి చేకూరే రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలు తరుచూ వస్తున్నాయి. మహారాష్ట్రలో దళిత, ముస్లిం ఐక్యత ప్రయోగం 30 ఏళ్ల కిందటే జోగేంద్ర కవాడే, హాజీ మస్తాన్ చేశారు. కానీ, కాంగ్రెస్‌ను దెబ్బతీయడం తప్ప రాజకీయంగా వారికెలాంటి ప్రయోజనం చేకూరలేదు. దీంతో తాజాగా ఎంఐఎం, బీఆర్పీ–బహుజన్ మహాసంఘ్ కూటమిగా ఏర్పడటంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు లబ్ధి పొందుతారు, ఎవరు నష్టపోతారనేది తేటతెల్లం కానుంది. ఇదివరకు జరిగిన పలు ఎన్నికల్లో బీఆర్పీ–బహుజన్ మహసంఘ్, ఎంఐఎం తమ అభ్యర్థులను బరిలోకి దింపడం వల్ల పెద్దగా ఒరిగిందేమి లేదు.
Comments
Please login to add a commentAdd a comment