సాక్షి, ముంబై : మహారాష్ట్రలో ఇటీవల పొడిచిన ఎంఐఎం-బీఆర్పీ–బహుజన్ మహాసంఘ్ (బీబీఎం) పొత్తులను బోగస్‌గా శివసేవ వర్ణించింది. వారి మధ్య పొత్తు అనైతికమని.. వారి అంతిమ లక్ష్యం బీజేపీకి లబ్ధి చేకూర్చడమేనని అభిప్రాయడింది. రానున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో కలిసి పోటీచేసేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, బీబీఎం ఛీప్, అంబేద్కర్ మనువడు ప్రకాశ్ అంబేద్కర్ చేతులు కలిపిన విషయం తెలిసిందే. దీనిపై శివసేన అధికార పత్రిక సామ్నాలో సోమవారం ఎడిటోరియల్‌ను ప్రచురించింది. ఎంఐఎం, బీబీఎమ్ పార్టీలు బీజేపీకి మిత్రపక్షాలని, రానున్న ఎన్నికల్లో మోదీ విజయానికి లబ్ధి చేకూర్చడం కోసమే రెండు పార్టీలు జట్టు కట్టాయని శివసేన పేర్కొంది.
ముస్లింలీగ్‌కు అవినీతి వర్షన్ ఎంఐఎం అని.. ఓవైసీ ముస్లింలను కేవలం ఓట్‌బ్యాంక్ కోసమే ఉపయోగించుకుంటున్నారని విమర్శించింది. దేశంలో ఉన్న 25 కోట్ల మంది ముస్లింలు హిందూవులను అధిగమించగలరన్న ఓవైసీతో ప్రకాశ్ ఎలా చేతులు కలుపుతారని సేన ప్రశ్నించింది. ఎంఐఎంతో చేతులు కలిపి షెడ్యుల్ కులాలకు ప్రకాశ్ నమ్మకద్రోహం చేశారని వ్యాఖ్యానించింది. రెండు విభిన్న పార్టీలు చేతులు కలపడం వల్ల రాష్ట్రంలో అల్లర్లు చోటుచేసుకునే అవకాశం కూడా ఉందని సేన హెచ్చరించింది.
ఎవరికి లబ్ధి...
ఓట్లు చీల్చడానికి బీఆర్పీ–బహుజన్ ఇంతకుముందు ఎన్నికల బరిలోకి దిగినప్పుడల్లా బీజేపీకి లాభించిందని ఫలితాల తరువాత స్పష్టమైంది. మరోపక్క ఓవైసీ కూడా బీజేపీకి లబ్ధి చేకూరే రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలు తరుచూ వస్తున్నాయి. మహారాష్ట్రలో దళిత, ముస్లిం ఐక్యత ప్రయోగం 30 ఏళ్ల కిందటే జోగేంద్ర కవాడే, హాజీ మస్తాన్ చేశారు. కానీ, కాంగ్రెస్‌ను దెబ్బతీయడం తప్ప రాజకీయంగా వారికెలాంటి ప్రయోజనం చేకూరలేదు. దీంతో తాజాగా ఎంఐఎం, బీఆర్పీ–బహుజన్ మహాసంఘ్ కూటమిగా ఏర్పడటంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు లబ్ధి పొందుతారు, ఎవరు నష్టపోతారనేది తేటతెల్లం కానుంది. ఇదివరకు జరిగిన పలు ఎన్నికల్లో బీఆర్పీ–బహుజన్ మహసంఘ్, ఎంఐఎం తమ అభ్యర్థులను బరిలోకి దింపడం వల్ల పెద్దగా ఒరిగిందేమి లేదు.
Comments
Please login to add a commentAdd a comment