
సాక్షి, నందిగాం: తిత్లీ తుపాన్‌తో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలవాసులకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడి వ్యవహార శైలి విస్మయానికి గురిచేసింది. తుపాన్ సంభవించిన ఐదు రోజుల తర్వాత సోమవారం తీరిగ్గా మండలంలోని కొండల ప్రాంత గ్రామాల్లో పర్యటించిన ఆయన బాధితులకు భరోసా కల్పించడానికి బదులు ఓట్లు అడగడంతో వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ‘‘మీరు ఓట్లు వేయకపోయినా మీకు రోడ్లు వేశా. ఈసారి ఓట్లు నాకే వేయాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓట్లు అడిగితే మెడలు వంచి ఈడ్చుకు వెళ్లాలి’’ అని అచ్చెన్నాయుడు చెప్పడంపై రధజనబొడ్డపాడు గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత గల మంత్రిగా తుపాన్ బాధితులకు అండగా ఉండాల్సిందిపోయి గ్రామాల్లో గొడవలు సృష్టించేలా మాట్లాడటం ఏమిటని వారు మండిపడుతున్నారు. అధికార దర్పంతో మొక్కుబడిగా వచ్చి వెళ్లారు తప్ప తమకు ఎలాంటి సాయం చేయలేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.
గ్రామాల్లో గొడవలు సృష్టిస్తారా?
‘‘గ్రామంలో ఎవరైనా టీడీపీకి ఓట్లు వేయకపోతే ఈడ్చుకొచ్చి ఓట్లు వేయించండి అని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం దారుణం. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో గొడవులు పెట్టి వర్గాలు ఏర్పడేలా చూసి లాభం పొందాలనుకోవడం మంత్రికి తగదు’’
– అంబలి జానకీరావు
మంత్రికి రాజకీయాలే ముఖ్యమా?
‘‘తుపాన్ బారిన పడి అన్నీ కోల్పోయిన మాకు సాయం చేయకుండా ఈ సమయంలో ఓట్లు, రాజకీయాల గురించి మాట్లాడటం ఏమిటి? పేదలు ఎమైపోయినా ఫర్వాలేదు కానీ మంత్రికి రాజకీయాలే ముఖ్యమా?
– సవర శార్వాణి