సాక్షి, సంగారెడ్డి/ మునిపల్లి (అందోల్): ఆఫ్రికా నుంచి కందులు దిగుమతి చేసుకోవడం ఏమిటని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణంకోసం పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తు్తన్న ఎగుమతి, దిగుమతుల విధానంతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. ఈ విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ‘కొరత ఉంటే దిగుమతి చేసుకోవాలి, కానీ మన రైతులే అద్భుతంగా వివిధ రకాల పంటలు పండిస్తుంటే ఇక దిగుమతి ఎందుకు’అని ప్రశ్నించారు. కందులను తెలంగాణ రైతులు బాగా పండిస్తున్నారని ప్రశంసించారు.
(చదవండి: క‘రోనా’ పార్టీ)
అంతే కాకుండా నాణ్యమైన పత్తిని పండిస్తున్నారని, పంట వేసే సమయంలో ధర ఒకరకంగా, ఆ తర్వాత పంట చేతికి వచ్చాక మరో రకంగా ఉండడంతో రైతులు నష్టాల్లో కూరుకు పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కందులు, పత్తి పంటకు వచ్చే లాభం రైతులకే చెందాలన్నారు. పరిశ్రమలకు, దళారులకు లాభం.., రైతులకు నష్టం వచ్చే విధానాలను రద్దు చేయాలన్నారు. అనంతరం మంత్రి సంగారెడ్డి కలెక్టరేట్‌లో అభివృద్ధి పనులపై అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 15వ తేదీలోగా డంప్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. లేకపోతే సంబంధిత గ్రామాల సర్పంచులు, కార్యదర్శులపై వేటు తప్పదని హెచ్చరించారు. పనుల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమతో చెప్పాలని సూచించారు.
కరోనా పేషెంట్లకు హరీశ్ ఫోన్
కరోనా రోగులకు మనోధైర్యాన్ని ఇచ్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ చాంబర్‌లో శనివారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కరోనా కేసుల వివరాలు, పాజిటివ్ పేషెంట్ల విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాల వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయి, హోం ఐసోలేషన్‌లో ఉన్న కొందరు రోగులతో మంత్రి హరీశ్‌రావు ఫోన్‌లో మాట్లాడారు. పాజిటివ్‌గా తేలి ఎన్ని రోజులైంది, చికిత్స తీసుకుంటున్నారా.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు. మందులు ఇస్తున్నారా. వైద్యులు, సిబ్బంది తరచుగా వచ్చి పరీక్షలు చేస్తున్నారా. అని వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, వైద్య సిబ్బంది బాగానే స్పందిస్తున్నారని, అన్ని విధాలా తమకు ధైర్యం చెబుతూ చికిత్స చేస్తున్నారని రోగులు మంత్రికి వివరించారు. ఏదైనా అసవరం ఉంటే తనకు ఫోన్‌చేయాలని హరీశ్‌రావు వారికి సూచించారు.
(కరోనాపై ఆందోళన వద్దు)
Comments
Please login to add a commentAdd a comment