Lentils purchasing
-
కేంద్రంపై హరీశ్‌రావు ఆగ్రహం
సాక్షి, సంగారెడ్డి/ మునిపల్లి (అందోల్): ఆఫ్రికా నుంచి కందులు దిగుమతి చేసుకోవడం ఏమిటని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణంకోసం పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తు్తన్న ఎగుమతి, దిగుమతుల విధానంతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. ఈ విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ‘కొరత ఉంటే దిగుమతి చేసుకోవాలి, కానీ మన రైతులే అద్భుతంగా వివిధ రకాల పంటలు పండిస్తుంటే ఇక దిగుమతి ఎందుకు’అని ప్రశ్నించారు. కందులను తెలంగాణ రైతులు బాగా పండిస్తున్నారని ప్రశంసించారు. (చదవండి: క‘రోనా’ పార్టీ) అంతే కాకుండా నాణ్యమైన పత్తిని పండిస్తున్నారని, పంట వేసే సమయంలో ధర ఒకరకంగా, ఆ తర్వాత పంట చేతికి వచ్చాక మరో రకంగా ఉండడంతో రైతులు నష్టాల్లో కూరుకు పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కందులు, పత్తి పంటకు వచ్చే లాభం రైతులకే చెందాలన్నారు. పరిశ్రమలకు, దళారులకు లాభం.., రైతులకు నష్టం వచ్చే విధానాలను రద్దు చేయాలన్నారు. అనంతరం మంత్రి సంగారెడ్డి కలెక్టరేట్లో అభివృద్ధి పనులపై అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 15వ తేదీలోగా డంప్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. లేకపోతే సంబంధిత గ్రామాల సర్పంచులు, కార్యదర్శులపై వేటు తప్పదని హెచ్చరించారు. పనుల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమతో చెప్పాలని సూచించారు. కరోనా పేషెంట్లకు హరీశ్ ఫోన్ కరోనా రోగులకు మనోధైర్యాన్ని ఇచ్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ చాంబర్లో శనివారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కరోనా కేసుల వివరాలు, పాజిటివ్ పేషెంట్ల విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాల వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయి, హోం ఐసోలేషన్‌లో ఉన్న కొందరు రోగులతో మంత్రి హరీశ్‌రావు ఫోన్లో మాట్లాడారు. పాజిటివ్‌గా తేలి ఎన్ని రోజులైంది, చికిత్స తీసుకుంటున్నారా.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు. మందులు ఇస్తున్నారా. వైద్యులు, సిబ్బంది తరచుగా వచ్చి పరీక్షలు చేస్తున్నారా. అని వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, వైద్య సిబ్బంది బాగానే స్పందిస్తున్నారని, అన్ని విధాలా తమకు ధైర్యం చెబుతూ చికిత్స చేస్తున్నారని రోగులు మంత్రికి వివరించారు. ఏదైనా అసవరం ఉంటే తనకు ఫోన్‌చేయాలని హరీశ్‌రావు వారికి సూచించారు. (కరోనాపై ఆందోళన వద్దు) -
ఆది అనుచరులకు భోజ్యం!
సాక్షి ప్రతినిధి కడప: ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే బహిరంగ మార్కెట్లో తక్కువ రేటుకు కందులు లభిస్తున్నాయి. కాగా కందుల కొనుగోలు గడువు ముగిసింది. నిల్వ ఉన్నవి ప్రభుత్వం కొనుగోలు చేస్తే అధిక ఆదాయం గడించవచ్చు. అదే ఆలోచన మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులకు తట్టింది. మార్క్‌ఫెడ్ ద్వారా కందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి పెంచారు.అమరావతి స్థాయిలో చినబాబు నుంచి పైరవీలు చేయించారు. మే 19కే గడువు ముగిసినా జమ్మలమడుగు నియోజకవర్గంలో మాత్రమే 1500 క్వింటాళ్లు కొనుగోలు చేసేందుకు అనుమతులిచ్చారు. వెరసి దాదాపు రూ.30లక్షలు ప్రజాధనం దోపిడీ చేసిన వైనమిది. జిల్లాలో 22,120 ఎకరాలల్లో కందిపంట సాగుచేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 77,420 క్వింటాళ్ల దిగుబడి ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కందులు క్వింటా రూ.5,450లతో తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి19 నుంచి మే19వరకు మూడునెలలు పాటు సేకరించింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 60,131 క్వింటాళ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. తక్కినవి రైతుల అవసరాల రీత్యా కొన్ని, నిల్వ రూపంలో మరికొన్ని ఉండిపోయాయి. కాగా ప్రస్తుతం కందులు క్వింటా ధర రూ.3600 మాత్రమే బహిరంగ మార్కెట్లో పలుకుతోంది. ప్రభుత్వం రూ.5,450తో కొనుగోలు చేసిన నేపథ్యంలో రూ.1850 క్వింటాపై తేడా ఉంది. ఈనేపథ్యంలో మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు దళారుల అవతారమెత్తారు. గడువు ముగిసినా తాము ప్రభుత్వంతో కొనుగోలు చేయించే చర్యలు చేపడతాం, క్వింటాకు రూ.1000కి మేము తీసుకుంటాం, తక్కిన మొత్తం మీకు అప్పగిస్తాం, మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామనే తెరవెనుక ఒప్పందానికి వచ్చారు. ముందుగా 6వేల క్వింటాళ్లు సమీకరించినట్లు సమాచారం. వీటిని మునపటి తేదీలతో కొనుగోలు చేసినట్లు రికార్డులు సవరించాలనే స్థానిక అధికార యంత్రాంగంపై ఒత్తిడి తీసుకవచ్చారు. ఇప్పట్లో తాము ఇలాంటి సాహసం చేయలేమని ఉన్నతస్థాయిలో ఏమైనా చేసుకోండి, మావల్ల కాదంటూ అధికారులు చేతులెత్తేశారు. చినబాబు డైరెక్షన్..కొనుగోలుకు శ్రీకారం.. గడువు ముగిసిన తర్వాత కందులు కొనుగోలు చేయడం సాధ్యపడదని మార్క్‌ఫెడ్ జిల్లాస్థాయి అధికారులు వెల్లండిచిన తర్వాత వ్యవహారం రాజధానికి చేరింది. కమిషనర్ స్థాయిలో నిబంధనలు అడ్డువస్తాయని వివరించడంతో ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారాలోకేష్ జోక్యం అనివార్యమైనట్లు సమాచారం. కమిషనర్‌పై మంత్రి లోకేష్ ఒత్తిడి పెంచి ఒప్పించినట్లు తెలుస్తోంది. మంత్రి ఆది సూచించిన రైతులు (మంత్రి అనుచరులు) కందులు కొనుగోలు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సీఎం తర్వాత స్థానంలో ఉన్న లోకేష్ ఆదేశాలతో మార్క్‌ఫెడ్ అధికారులు నిబంధనలు విరుద్ధమైనప్పటికీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. జమ్మలమడుగు, పెద్దముడియం మండలాలకు చెందిన రైతుల పేరిట కొనుగోలు చేపట్టారు. ప్రస్తుతం 1500 క్వింటాళ్లు కొనుగోలుకు అనుమతులు ఇచ్చారు. ఆమేరకు జమ్మలమడుగు మార్కెట్ యార్డులో సోమవారం అధికార యంత్రాంగం కందులు సేకరించింది. మంత్రి ఆది అనుచరులను సంతృప్తి పర్చేందుకు ప్రజాధనానికి కన్నం వేశారని పలువురు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.30లక్షలు అనుచరులకు దోచిపెట్టే చర్యలకు పాల్పడ్డారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఎండీ నుంచి అనుమతులు తీసుకున్నాం మార్క్ఫెడ్శాఖ రాష్ట్ర మేనేజింగ్ డైరక్టర్ మ«ధుసూదన్రెడ్డి నుంచి అనుమతులు తీసుకున్నాం. జమ్మలమడుగు ఏరియాలో ఈ ఏడాది మార్చి నెలలో రైతులు కందులు విక్రయించుకోలేకపోయారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం నిలిపి వేసే సమయంలో వారు మార్క్‌ఫెడ్ సంస్థకు అమ్ముకోలేకపోయారు. అందువల్ల అనుమతులు తీసుకుని తూకాలు వేస్తున్నాం. –రమేష్, జిల్లా మేనేజర్, మార్క్పెఢ్ సంస్థ, కడప -
కందుల కొనుగోలు కేంద్రాలు మూత
భువనగిరి/ఆలేరు : జిల్లాలో హాకా సంస్థ ఆ« ద్వర్యంలో ఏర్పాటు చేసి న రెండు కందుల కొనుగోలు కేంద్రాలను శని వారం నుంచి మూసివేయనున్నారు. ఇప్పటికే అధికారులు కొనుగోలు కేంద్రాల వద్ద కేంద్రాలను మూసివేస్తున్నట్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జిల్లాలో రెండు కేంద్రాలు మూసివేత జిల్లాలో కందులను కొనుగోలు చేసేందుకు హాకా సంస్థ ఆధ్వర్యంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఆలేరులో జనవరి 17, భువనగిరిలో 18వ తేదీన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆలేరులో ఇప్పటి వరకు 2,106మంది రైతుల నుంచి 19,844క్వింటాళ్ల కందులను కొనుగోలు చేయగా భువనగిరిలో 2,557రైతుల నుంచి 20,927క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు భువనగిరిలో 374మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 3,110క్వింటాళ్లకుగాను రూ.1.69 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కాగా ఇంకా రూ.10కోట్లు రావాల్సి ఉంది. ఆలేరులో 400మంది రైతులకు సంబంధించిన 1,411క్వింటాళ్లకుగాను జనవరి 30నాటికి రూ.85లక్షలను రైతుల ఖాతాల్లో వేశారు. కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నాం జిల్లా మార్కెట్ శాఖ అధికారి ఆదేశాల మేరకు శనివారం నుంచి కందుల కొనుగోలు కేంద్రాలు మూసివేస్తున్నాం. రైతులు ఈవిషయాన్ని గమనించి రైతులు గమనించి సహకరించాలని కోరుతున్నాం.– వేణుగోపాల్‌రెడ్డి, మార్కెట్ కార్యదర్శి,భువనగరి -
దళారులకే ‘మద్దతు’!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో 52వేల ఎకరాల్లో కంది పంటను సాగు చేయగా, 15,277 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కంది దిగుబడులు మార్కెట్లకు పోటెత్తుతుండగా.. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.3,600 నుంచి రూ.4,500 వరకు చెల్లిస్తున్నారు. కంది రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. క్వింటాలుకు రూ.5,450 మద్దతు ధర ప్రకటించి.. ఇప్పటి వరకు 7,400 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో తెల్లాపూర్, సదాశివపేట, జహీరాబాద్, ఇప్పపల్లి, న్యాలకల్, ఝరాసంగం, నారాయణఖేడ్, మనూరు, కంగ్టి, వట్పల్లి, రాయికోడ్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కందుల కొనుగోలు జరుగుతోంది. రెవెన్యూ అధికారులు జారీ చేసే సాగు ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా నంబరు జిరాక్స్ కాపీతో వచ్చే రైతుల నుంచి మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో కందులు తీసుకుంటారు. కనీసం 12శాతం లోపు తేమ ఉన్న శాంపిళ్లను తెచ్చే రైతులకు మాత్ర మే తేదీల వారీగా టోకెన్లు జారీ చేస్తున్నా రు. టోకెన్లపై ఉన్న తేదీల్లో వచ్చే రైతుల నుంచి మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు కందులు సేకరించాల్సి ఉంటుంది. అక్రమాలకు సరి‘హద్దు’ లేవీ? నారాయణఖేడ్, కంగ్టి, మనూరు, నాగల్గిద్ద, జహీరాబాద్, న్యాల్కల్ తదితర మండలాలకు సరిహద్దులో ఉన్న కర్ణాటక నుంచి కందులు అక్రమ మార్గాల్లో జిల్లాలోకి తరలివస్తున్నాయి. గతంలో జిల్లాకు చెందిన సరిహద్దు ప్రాంత రైతులు బీదర్ ప్రాంతంలో శనగలను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకునేవారు. ప్రస్తుతం కర్ణాటకలో కంది కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, బీదర్ ప్రాంతంలో కంది ధర క్వింటాలుకు రూ.3,500కు మించి పలకడం లేదు. దీంతో దళారులు కొందరు కర్ణాటకలో పండించిన కందులను సరిహద్దు గ్రామాల్లోకి చేరవేస్తున్నారు. గ్రామ రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమంగా సాగు ధ్రువీకరణ పత్రాలను పొందుతున్నారు. మరోవైపు దళారులకు మార్క్‌ఫెడ్ యంత్రాంగం సహకరిస్తూ టోకెన్లు జారీ చేస్తోంది. కళ్లముందే పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న కందులు కొనుగోలు చేస్తున్న మార్క్‌ఫెడ్ తీరుతో స్థానిక రైతులు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. మరోవైపు జిల్లాలో అంచనా వేసిన కంది దిగుబడిలో సగం మేర కొనుగోలు చేసినట్లు మార్క్‌ఫెడ్ లెక్కలు చెప్తోంది. రైతులు మాత్రం ఇంకా దిగుబడులు వస్తున్న దశలోనే.. దళారుల నుంచి కొనుగోలు చేస్తే .. కోటా ముగిసిందనే నెపంతో కేంద్రా లు మూసివేసే అవకాశం ఉందని ఆందో ళన చెందుతున్నారు. చెక్‌పోస్టులు కనిపించవెందుకని? కర్ణాటక నుంచి అక్రమంగా తరలివస్తున్న కందులను ఇటీవల కంగ్టి రెవెన్యూ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు శాఖలు సమన్వయంతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఇటీవల నారాయణఖేడ్ నియోజకవర్గ పర్యటనలో మంత్రి హరీశ్‌రావు ఆదేశిం చారు. ఇప్పటి వరకు చెక్‌పోస్టులు ఏర్పాటు కాక పోగా, రోడ్డు మార్గంపై నిఘా ఉంటుందనే ఉద్దేశంతో దళారులు రూటు మార్చారు. కారాముంగి, గౌడ్గావ్ జనవాడ, తోర్నాల్, ఎన్జీ హుక్రానా తదితర చోట్ల మంజీరా నదిలో పుట్టి మార్గంలో కందులు వస్తున్నాయి. కంగ్టిలో దళారులదే రాజ్యం కంగ్టిలో జనవరి 21న కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం కాగా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలివస్తున్నాయి. దళారీలకు సహకరించేలా మార్క్‌ఫెడ్ కృత్రిమంగా బార్దాన్ (గోనె సంచులు) కొరత సృష్టిస్తోంది. టోకెన్ల కోసం రైతులు పడిగాపులు పడుతున్నా.. దళారీలకు మాత్రం గంటల వ్యవధిలోనే టోకెన్ల జారీ, తూకం వేయడం జరుగుతోంది. రెవెన్యూ అధికారులు సాగు విస్తీర్ణంపై ఎలాంటి విచారణ జరపకుండానే టోకెన్లపై సంతకాలు చేస్తూ దళారీలకు సహకరిస్తున్నారు. గత ఏడాది దాదాపు 80 రోజులు కొనసాగిన కొనుగోలు కేంద్రంలో 37 వేల క్వింటాళ్లు సేకరించగా.. ప్రస్తుతం కేంద్రం ప్రారంభమైన పది రోజుల్లోనే 11 వేల క్వింటాళ్లు తూకం వేశారు. 50 బస్తాల కందులు పట్టివేత నారాయణఖేడ్: నారాయణఖేడ్‌లోని కందుల కొనుగోలు కేంద్రానికి వ్యాపారులు తెచ్చిన 50 బస్తాల కందులను మార్క్‌ఫెడ్ అధికారులు సోమవారం పట్టుకొని సీజ్ చేశారు. ఈ సందర్భంగా మార్క్‌ఫెడ్ డీఎం ఇంద్రసేన విలేకరులతో మాట్లాడుతూ.. నారాయణఖేడ్‌లోని కొనుగోలు కేంద్రానికి గుర్తుతెలియని వ్యాపారులు రెండు రోజుల క్రితం 50 బస్తాల కందులు తెచ్చారని, తమకు అందిన సమాచారం మేరకు బస్తాలను సీజ్‌చేసినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం రైతులు సాగుచేసిన పంటను మాత్రమే అధికారులు ధ్రువీకరణ ప్రకారం కొనుగోలు చేస్తారని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం విఠల్‌రెడ్డి, రాజారెడ్డి అనే వ్యక్తులు 85బస్తాల కందులను అమ్మారని, ఇవి కూడా రైతులవి కాదని తమకు ఫిర్యాదు అందిందన్నారు. కొనుగోలు చేసిన కందులకు సంబంధించి డబ్బులు వారి ఖాతాల్లో పడకుండా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు కాకుండా వ్యాపారులు తీసుకువస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు తీసుకున్న టోకెన్ ప్రకారం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఖరీఫ్‌లో వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఎకరాకు 4క్వింటాళ్ల వరకే దిగుబడి వచ్చిందని వ్యవసాయ అధికారులు నివేదించారన్నారు. ఈ లెక్కన 4క్వింటాళ్ల కంటే ఎక్కువ తీసుకు వస్తే వీఆర్వో ధ్రువీకరణ కాకుండా వ్యవసాయ అధికారి ధ్రువీకరణ అవసరమని స్పష్టం చేశారు. దళారులకే ప్రాధాన్యం.. కందుల కొనుగోలు కేంద్రాల వద్దకు పంటను తెచ్చి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అధికారులు ముందుగా వ్యాపారులు, దళారులు తెచ్చిన కందులు కొనుగోలు చేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి. – రవి, రైతు, పైడిపల్లి పట్టించుకోవడం లేదు.. రెండు క్వింటాళ్ల కందులు మనూరు కొనుగోలు కేంద్రానికి తెచ్చి రెండు రోజులు అవుతోంది. అధికారులు టోకెన్ ఇచ్చినా కందులు కొనడంలేదు. బీదర్ నుంచి దళారులు, వ్యాపారుల కందులను మాత్రం కొంటున్నారు. రైతులను పట్టించుకోవడంలేదు. – సాలె నారాయణ, రైతు, మనూరు ధ్రువీకరణ పత్రాలు తెస్తేనే.. రైతులు తెచ్చే శాంపిళ్లలో 12 శాతం లోపు తేమ ఉంటేనే టోకెన్లు జారీ చేస్తున్నాం. రెవె న్యూ అధికారులు జారీ చేసే సాగు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నంబరు, పట్టాదారు పాసుపుస్తకం నకలు కాపీలు ఉంటేనే కొనుగోలు చేస్తున్నాం. కం దుల కొనుగోలులో అవకతవకల కు తావు లేకుండా పారదర్శకంగా కొనుగో లు చేస్తున్నాం. త్వరలో శనగ కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసేందుకు అనుమతి వచ్చింది. – ఇంద్రసేన్, డీఎం, మార్క్‌ఫెడ్ తనిఖీలు ముమ్మరం చేశాం పొరుగు రాష్ట్రం నుంచి కందులు అక్రమంగా తరలిరాకుండా ఉండేందుకు రెవెన్యూ, వ్యవసాయ మార్కెటింగ్ విభాగాలకు ఆదేశాలు జారీ చేశాం. కర్ణాటక సరిహద్దుల్లో మూడు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశాం. కంగ్టిలో అక్రమంగా తరలిస్తున్న కందులను సీజ్ చేసి, కేసు నమోదు చేశాం. అక్రమాలకు పాల్పడే ప్రభుత్వ సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తాం. – డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జేసీ అధికారుల అండతోనే.. రెవెన్యూ అధికారుల అండతోనే అక్రమంగా వస్తున్న కందుల కొనుగోలును మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోలు చేస్తున్నారు. రెవెన్యూ, మార్క్‌ఫెడ్ సిబ్బంది కుమ్మక్కై స్థానిక రైతులకు అన్యాయం చేస్తున్నారు. మేము టోకెన్ల కోసం కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా.. దళారీల సరుకు మాత్రం ఉదయం, సాయంత్రం విరామం లేకుండా తూకం వేస్తున్నారు. హమాలీల దోపిడీ కూడా భారీగానే ఉంది. రైతులు తెచ్చిన ధాన్యంలో తూకం పేరిట కింద పడేస్తూ.. రోజూ క్వింటాళ్ల కొద్దీ పోగు చేసి అమ్ముకుంటున్నారు. – సంగారెడ్డి, రైతు, మనూరు -
తాండూరులో కందుల కొనుగోళ్లు ప్రారంభం
రంగారెడ్డి జిల్లా: తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) శుక్రవారం తొలిసారిగా కందుల కొనుగోళ్లను ప్రారంభించింది. కందుల కొనుగోలు కేంద్రంలో సగటు ధర రూ.11,800 చొప్పున రెండు క్వింటాళ్ల కందులను కొనుగోలు చేసింది. వందకు ఒక శాతం మార్కెట్ ఫీజుతోపాటు, ఏజెంట్‌కు కమీషన్ ఒక శాతం చొప్పున మర్పల్లికి చెందిన రైతు లక్ష్మారెడ్డి నుంచి ఎఫ్‌సీఐ కందులు కొనుగోలు చేసింది. మార్కెట్లో కందుల విక్రయంపై చెల్లించాల్సిన రెండు శాతం కమీషన్ లేకపోవడంతో ఎఫ్‌సీఐ కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు రైతులు ఆసక్తిని చూపుతున్నారు.