దళారులకే ‘మద్దతు’! | mediators defrauding markfed for msp to lentils | Sakshi
Sakshi News home page

దళారులకే ‘మద్దతు’!

Published Tue, Feb 6 2018 6:30 PM | Last Updated on Tue, Feb 6 2018 6:32 PM

mediators defrauding markfed for msp to lentils - Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో 52వేల ఎకరాల్లో కంది పంటను సాగు చేయగా, 15,277 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కంది దిగుబడులు మార్కెట్లకు పోటెత్తుతుండగా.. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.3,600 నుంచి రూ.4,500 వరకు చెల్లిస్తున్నారు. కంది రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. క్వింటాలుకు రూ.5,450 మద్దతు ధర ప్రకటించి.. ఇప్పటి వరకు 7,400 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసినట్లు మార్క్‌ఫెడ్‌ అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో తెల్లాపూర్, సదాశివపేట, జహీరాబాద్, ఇప్పపల్లి, న్యాలకల్, ఝరాసంగం, నారాయణఖేడ్, మనూరు, కంగ్టి, వట్‌పల్లి, రాయికోడ్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కందుల కొనుగోలు జరుగుతోంది. రెవెన్యూ అధికారులు జారీ చేసే సాగు ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా నంబరు జిరాక్స్‌ కాపీతో వచ్చే రైతుల నుంచి మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో కందులు తీసుకుంటారు. కనీసం 12శాతం లోపు తేమ ఉన్న శాంపిళ్లను తెచ్చే రైతులకు మాత్ర మే తేదీల వారీగా టోకెన్లు జారీ చేస్తున్నా రు. టోకెన్లపై ఉన్న తేదీల్లో వచ్చే రైతుల నుంచి మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు కందులు సేకరించాల్సి ఉంటుంది.

అక్రమాలకు సరి‘హద్దు’ లేవీ?
నారాయణఖేడ్, కంగ్టి, మనూరు, నాగల్‌గిద్ద, జహీరాబాద్, న్యాల్‌కల్‌ తదితర మండలాలకు సరిహద్దులో ఉన్న కర్ణాటక నుంచి కందులు అక్రమ మార్గాల్లో జిల్లాలోకి తరలివస్తున్నాయి. గతంలో జిల్లాకు చెందిన సరిహద్దు ప్రాంత రైతులు బీదర్‌ ప్రాంతంలో శనగలను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకునేవారు. ప్రస్తుతం కర్ణాటకలో కంది కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, బీదర్‌ ప్రాంతంలో కంది ధర క్వింటాలుకు రూ.3,500కు మించి పలకడం లేదు. దీంతో దళారులు కొందరు కర్ణాటకలో పండించిన కందులను సరిహద్దు గ్రామాల్లోకి చేరవేస్తున్నారు.

గ్రామ రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమంగా సాగు ధ్రువీకరణ పత్రాలను పొందుతున్నారు. మరోవైపు దళారులకు మార్క్‌ఫెడ్‌ యంత్రాంగం సహకరిస్తూ టోకెన్లు జారీ చేస్తోంది. కళ్లముందే పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న కందులు కొనుగోలు చేస్తున్న మార్క్‌ఫెడ్‌ తీరుతో స్థానిక రైతులు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. మరోవైపు జిల్లాలో అంచనా వేసిన కంది దిగుబడిలో సగం మేర కొనుగోలు చేసినట్లు మార్క్‌ఫెడ్‌ లెక్కలు చెప్తోంది. రైతులు మాత్రం ఇంకా దిగుబడులు వస్తున్న దశలోనే.. దళారుల నుంచి కొనుగోలు చేస్తే .. కోటా ముగిసిందనే నెపంతో కేంద్రా లు మూసివేసే అవకాశం ఉందని ఆందో ళన చెందుతున్నారు.

చెక్‌పోస్టులు కనిపించవెందుకని?
కర్ణాటక నుంచి అక్రమంగా తరలివస్తున్న కందులను ఇటీవల కంగ్టి రెవెన్యూ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు శాఖలు సమన్వయంతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఇటీవల నారాయణఖేడ్‌ నియోజకవర్గ పర్యటనలో మంత్రి హరీశ్‌రావు ఆదేశిం చారు. ఇప్పటి వరకు చెక్‌పోస్టులు ఏర్పాటు కాక పోగా, రోడ్డు మార్గంపై నిఘా ఉంటుందనే ఉద్దేశంతో దళారులు రూటు మార్చారు. కారాముంగి, గౌడ్‌గావ్‌ జనవాడ, తోర్నాల్, ఎన్‌జీ హుక్రానా తదితర చోట్ల మంజీరా నదిలో పుట్టి మార్గంలో కందులు వస్తున్నాయి.

కంగ్టిలో దళారులదే రాజ్యం
కంగ్టిలో జనవరి 21న కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం కాగా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలివస్తున్నాయి. దళారీలకు సహకరించేలా మార్క్‌ఫెడ్‌ కృత్రిమంగా బార్దాన్‌ (గోనె సంచులు) కొరత సృష్టిస్తోంది. టోకెన్ల కోసం రైతులు పడిగాపులు పడుతున్నా.. దళారీలకు మాత్రం గంటల వ్యవధిలోనే టోకెన్ల జారీ, తూకం వేయడం జరుగుతోంది. రెవెన్యూ అధికారులు సాగు విస్తీర్ణంపై ఎలాంటి విచారణ జరపకుండానే టోకెన్లపై సంతకాలు చేస్తూ దళారీలకు సహకరిస్తున్నారు. గత ఏడాది దాదాపు 80 రోజులు కొనసాగిన కొనుగోలు కేంద్రంలో 37 వేల క్వింటాళ్లు సేకరించగా.. ప్రస్తుతం కేంద్రం ప్రారంభమైన పది రోజుల్లోనే 11 వేల క్వింటాళ్లు తూకం వేశారు.

50 బస్తాల కందులు పట్టివేత
నారాయణఖేడ్‌: నారాయణఖేడ్‌లోని కందుల కొనుగోలు కేంద్రానికి వ్యాపారులు తెచ్చిన 50 బస్తాల కందులను మార్క్‌ఫెడ్‌ అధికారులు సోమవారం పట్టుకొని సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా మార్క్‌ఫెడ్‌ డీఎం ఇంద్రసేన విలేకరులతో మాట్లాడుతూ.. నారాయణఖేడ్‌లోని కొనుగోలు కేంద్రానికి గుర్తుతెలియని వ్యాపారులు రెండు రోజుల క్రితం 50 బస్తాల కందులు తెచ్చారని, తమకు అందిన సమాచారం మేరకు బస్తాలను సీజ్‌చేసినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం రైతులు సాగుచేసిన పంటను మాత్రమే అధికారులు ధ్రువీకరణ ప్రకారం కొనుగోలు చేస్తారని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం విఠల్‌రెడ్డి, రాజారెడ్డి అనే వ్యక్తులు 85బస్తాల కందులను అమ్మారని, ఇవి కూడా రైతులవి కాదని తమకు ఫిర్యాదు అందిందన్నారు.

కొనుగోలు చేసిన కందులకు సంబంధించి డబ్బులు వారి ఖాతాల్లో పడకుండా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు కాకుండా వ్యాపారులు తీసుకువస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు తీసుకున్న టోకెన్‌ ప్రకారం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఖరీఫ్‌లో వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఎకరాకు 4క్వింటాళ్ల వరకే దిగుబడి వచ్చిందని వ్యవసాయ అధికారులు నివేదించారన్నారు. ఈ లెక్కన 4క్వింటాళ్ల కంటే ఎక్కువ తీసుకు వస్తే వీఆర్వో ధ్రువీకరణ కాకుండా వ్యవసాయ అధికారి ధ్రువీకరణ అవసరమని స్పష్టం చేశారు. 


దళారులకే ప్రాధాన్యం.. 
కందుల కొనుగోలు కేంద్రాల వద్దకు పంటను తెచ్చి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అధికారులు ముందుగా వ్యాపారులు, దళారులు తెచ్చిన కందులు కొనుగోలు చేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి.          
– రవి, రైతు, పైడిపల్లి 

పట్టించుకోవడం లేదు.. 
రెండు క్వింటాళ్ల కందులు మనూరు కొనుగోలు కేంద్రానికి తెచ్చి రెండు రోజులు అవుతోంది. అధికారులు టోకెన్‌ ఇచ్చినా కందులు కొనడంలేదు. బీదర్‌ నుంచి దళారులు, వ్యాపారుల కందులను మాత్రం కొంటున్నారు. రైతులను పట్టించుకోవడంలేదు. 
– సాలె నారాయణ, రైతు, మనూరు 

ధ్రువీకరణ పత్రాలు తెస్తేనే..
రైతులు తెచ్చే శాంపిళ్లలో 12 శాతం లోపు తేమ ఉంటేనే టోకెన్లు జారీ చేస్తున్నాం. రెవె న్యూ అధికారులు జారీ చేసే సాగు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా నంబరు, పట్టాదారు పాసుపుస్తకం నకలు కాపీలు ఉంటేనే కొనుగోలు చేస్తున్నాం. కం దుల కొనుగోలులో అవకతవకల కు తావు లేకుండా పారదర్శకంగా కొనుగో లు చేస్తున్నాం. త్వరలో శనగ కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసేందుకు అనుమతి వచ్చింది.  
– ఇంద్రసేన్, డీఎం, మార్క్‌ఫెడ్‌

తనిఖీలు ముమ్మరం చేశాం
పొరుగు రాష్ట్రం నుంచి కందులు అక్రమంగా తరలిరాకుండా ఉండేందుకు రెవెన్యూ, వ్యవసాయ మార్కెటింగ్‌ విభాగాలకు ఆదేశాలు జారీ చేశాం. కర్ణాటక సరిహద్దుల్లో మూడు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశాం. కంగ్టిలో అక్రమంగా తరలిస్తున్న కందులను సీజ్‌ చేసి, కేసు నమోదు చేశాం. అక్రమాలకు పాల్పడే ప్రభుత్వ సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తాం.  
– డాక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, జేసీ 

అధికారుల అండతోనే.. 
రెవెన్యూ అధికారుల అండతోనే అక్రమంగా వస్తున్న కందుల కొనుగోలును మార్క్‌ఫెడ్‌ అధికారులు కొనుగోలు చేస్తున్నారు. రెవెన్యూ, మార్క్‌ఫెడ్‌ సిబ్బంది కుమ్మక్కై స్థానిక రైతులకు అన్యాయం చేస్తున్నారు. మేము టోకెన్ల కోసం కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా.. దళారీల సరుకు మాత్రం ఉదయం, సాయంత్రం విరామం లేకుండా తూకం వేస్తున్నారు. హమాలీల దోపిడీ కూడా భారీగానే ఉంది. రైతులు తెచ్చిన ధాన్యంలో తూకం పేరిట కింద పడేస్తూ.. రోజూ క్వింటాళ్ల కొద్దీ పోగు చేసి అమ్ముకుంటున్నారు. 
– సంగారెడ్డి, రైతు, మనూరు

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

కంగ్టిలో కందుల కొనుగోలు కేంద్రానికి వచ్చి తూకాల కోసం ఎదురుచూస్తున్న రైతులు

2
2/2

వ్యాపారులు తెచ్చిన కందులను పట్టుకున్న మార్క్‌ఫెడ్‌ డీఎం ఇంద్రసేన 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement