సాక్షి, సంగారెడ్డి: గత ఏడాదితో పోలిస్తే అల్లం ధర ఒక్కసారిగా ఐదు రెట్లు పెరిగింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో రైతులు ఏటా అల్లం పంటను సంప్రదాయక పంటగా సాగుచేస్తూ వస్తున్నారు. ఐదేళ్లుగా క్వింటాలు అల్లం ధర రూ.2 వేల నుంచి రూ.2,500 మాత్రమే పలుకుతూ వచి్చంది. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో రూ.8 వేలకు పైగా ధర పలుకుతోంది. దీంతో పంటను సాగు చేస్తున్న రైతులు ఆనందంగా ఉన్నారు. ఐదేళ్లుగా మార్కెట్‌లో అల్లం పంటకు సరైన ధర లేక పోవడంతో దేశవ్యాప్తంగా సాగువిస్తీర్ణం భారీగా పడిపోయింది.
అంతే కాకుండా గత ఏడాది అధికంగా వర్షాలు పడటంతో సాగులో ఉన్న పంట సగానికి పైగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో పంటను కాపాడుకున్న రైతులకు కాసుల వర్షం కురుస్తోంది. అనేక మంది రైతులు గత ఏడాది క్రితమే ధర లేని కారణంగా అల్లం సాగుకు స్వస్తి చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 1,500 ఎకరాల్లో పంట సాగులో ఉన్నట్టు అంచనా. ఇందులో జహీరాబాద్ ప్రాంతంలోనే 90 శాతం సాగవుతోందని రైతులు చెపుతున్నారు.
ఈ ఏడాది మళ్లీ పంట సాగుపై ఆసక్తి
ప్రస్తుతం అల్లం పంటకు మార్కెట్‌లో మంచి ధర లభిస్తుండటంతో ఈ ఏడాది అల్లం పంటను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మే నెల నుంచి జూన్ చివరి వరకు రైతులు అల్లం పంటను సాగు చేస్తారు. ఎకరం పంట సాగుకు సుమారు 1.50 లక్షల మేర పెట్టుబడి వ్యయం అవుతుంది. మార్కెట్‌లో ధర ఉంటేనే గిట్టుబాటవుతుంది. లేకపోతే పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. కాగా, అల్లం పంట సాగుకు కేరళ రాష్ట్రం ప్రతీతి. ఈ ఏడాది అక్కడ కూడా భారీగానే పంట సాగుకు రైతులు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఈ ఏడాది 3 వేల ఎకరాలకు పైగా పంట సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయరంగ నిపుణులు చెపుతున్నారు.
పంట ఉన్న రైతులకు లబ్ధి
అల్లం పంట ఉన్న రైతులకు మంచి ధర వస్తోంది. దీంతో లబ్ధి పొందుతున్నారు. గతంలో ధర లేక రైతులు నష్టపోయిన సందర్భాలున్నాయి. పంట సాగు తక్కువగా ఉన్నందున రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తోంది. క్వింటాల్ ధర రూ.8 వేలు పలుకుతోంది. ఈ ఏడాది పంట సాగు పెరిగే అవకాశం ఉంది.
–అనూష, ఉద్యానవన అధికారి, జహీరాబాద్
బాగా గిట్టుబాటు అయింది
ఎకరం పొలంలో గత ఏడాది అల్లం పంట సాగు చేసుకున్నా. ఇటీవల పంటను తీసి విక్రయించా. 60 క్వింటాళ్ల మేర పంట దిగుబడి వచి్చంది. పంట సాగు కోసం సుమారు రూ.1.50 లక్షలు ఖర్చు పెట్టాను. క్వింటాలు అల్లం రూ.9 వేల ధరకు అమ్మాను. మంచి ధర రావడంతో బాగా గిట్టుబాటు అయింది.
– నర్సింహారెడ్డి, రైతు–చిరాగ్‌పల్లి
ఇంకా ధర పెరుగుతుందనే ఆశతో ఉన్న
అల్లం పంట తక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. దీంతో మరింత ధర పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేప థ్యంలో పంటను ఇంకా భూమిలోనే నిల్వ పెట్టాను. ప్రస్తుతం 4ఎక రాల్లో పంట ఉంది. ఈ ఏడాది మరో 6 ఎకరాల్లో సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా. క్వింటాలు ధర రూ.10 వేలకు పైగా పలికే అవకాశం ఉంది.
–వెంకట్‌రెడ్డి, రైతు, హోతి (కె)
చదవండి: ‘బాక్స్ సాగు’ భలేభలే..!
Comments
Please login to add a commentAdd a comment