
ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు(ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వంపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ వ్యతిరేక పార్టీలను వేధింపులకు గురుచేస్తుందని ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేక కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకొని వేధిస్తున్నారని విమర్శించారు. ఇందుకు హీరో శివాజీ వ్యాఖ్యలే నిదర్శనం అన్నారు.
సీబీఐ, ఈడీ, ఐటి సంస్థల నుంచి రేపోమాపో నోటీసులు రానున్నాయని బీజేపీ నేతలే చెబుతున్నారని మండిపడ్డారు. ఏపీపై ఆపరేషన్ గరుడ చేస్తున్నారని శివాజీ ఎప్పటి నుంచో చెబుతున్నారని గుర్తు చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
అవినీతిపరుల అండతో ప్రజాదరణ ఉన్నవారిని కాలరాయాలని ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రానికి ఇచ్చే నిధులను ఆపేసింది, అది చాలక కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. వేధింపు చర్యలకు వ్యతిరేకంగా ప్రజాస్వామవాదులంతా ఏకం కావాలన్నారు. జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని యనమల కోరారు.