సాక్షి, పశ్చిమ గోదావరి : టీడీపీలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. తొలి జాబితాలో తనకు సీటు దక్కకపోవడంతో టీడీపీ మాజీ మంత్రి పీతల సుజాత తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చింతలపూడి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సుజాతకు టీడీపీ తొలి జాబితాలో టికెట్ దక్కలేదు. ఆమె స్థానంలో కర్రా రాజారావుకు టీడీపీ కేటాయించింది. అయితే, మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా కొవ్వూరులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ సీటునైనా కేటాయించాలని సుజాత చంద్రబాబును ప్రాధేయపడినా ఫలితం లేకుండా పోయింది. ఆ సీటును వంగలపూడి అనితకు కేటాయించినట్టు తెలిసింది.
కాగా, టీడీపీ తొలి జాబితాలో జిల్లాలో ఉన్న 11 స్థానాల్లో 9 మంది సిట్టింగ్‌లకు మరోసారి అవకాశం కల్పించారు. సుజాతకు టికెట్ కేటాయించే విషయంలో మాగంటి వర్గం వ్యతిరేకతతో ఉన్నట్టు సమాచారం. వ్యతిరేక వర్గం ఒత్తిడితోనే సుజాతకు టికెట్ దక్కలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అవినీతి ఎమ్మెల్యేలు, మంత్రులకు టికెట్ కేటాయించిన చంద్రబాబు తనకు మాత్రం అన్యాయం చేశాడని సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. రెండో జాబితాలో కూడా ఆమెకు టికెట్ దక్కడం అనుమానమేనని పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు మార్కు రాజకీయాలతో సుజాత భవితవ్యం డోలాయమానంలో పడింది.
Comments
Please login to add a commentAdd a comment