
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏం ముఖం పెట్టుకుని ఎన్నికల పేరుతో ప్రజల వద్దకు వెళుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆర్ భూపతిరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ నినాదం నీళ్లు, నిధులు, నియామకాల్లో ఏ ఒక్క హామీ నెరవేరలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నిజామాబాద్ నుంచి ప్రారంభమైందని, పతనం కూడా ఇక్కడి నుంచేనని హెచ్చరించారు. బుధవారం నిజామాబాద్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తీరును తీవ్రంగా విమర్శించారు. నిజామాబాద్ రూరల్ తాజామాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌పైనా విరుచుకుపడ్డారు. పార్టీ ఆవిర్భావ సమయంలో కేసీఆర్ వెంట ఉన్న గుప్పెడు మంది నేతల్లో తాను ఒకడినని, తన లాంటి అనేక మందికి కేసీఆర్ అన్యాయం చేశారని ఆరోపించారు.
రూరల్ నుంచే పోటీ..
ఈ ఎన్నికల్లో తాను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకున్న 25 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశాకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. టీఆర్‌ఎస్ జిల్లాలో పూర్తిగా అస్తవ్య స్తంగా తయారైందని, ఎంపీ కవిత పీఏకున్న విలువ పార్టీ రాష్ట్ర కార్యదర్శులకు లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ విద్యాసాగర్‌రావు విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment