
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలపై మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మండిపడ్డారు. ఎన్నికల్లో మోదీ ఇచ్చిన రెండుకోట్ల ఉద్యోగాల హామీ వట్టి అభూత కల్పనగా మారిందని విరుచుకుపడ్డారు. ‘మోదీజీ ఎన్నికల ప్రచారంలో ఎన్నో పెద్దపెద్ద హామీలు ఇచ్చారు. అందులో ఒక్కటీ కూడా నెరవేర్చలేదు. ఆయన రెండుకోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. కనీసం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. వచ్చే ఆరేళ్లలో రైతుల ఆదాయం రెండింతలు చేస్తానని మోదీ ఆనాడు చెప్పారు. కానీ అందుకు పూర్తి తలకిందులుగా పరిస్థితి ఇప్పుడు ఉంది’ అని మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో మన్మోహన్ మాట్లాడారు.
గతంలో ఎన్నడూలేనివిధంగా జమ్మూకశ్మీర్ విషయంలో మోదీ అసమర్థ విధానాలను అవలంబిస్తోందని, మోదీ సర్కారు మిస్‌మేనేజ్‌మెంట్ వల్లే కశ్మీర్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని నిప్పులు చెరిగారు. ‘పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. మన సరిహద్దులు అంత సురక్షితంగా లేవు. సీమాంతర ఉగ్రవాదం, లేదా అంతర్గత పరిస్థితులు ఇందుకు కారణం’ అని ఆయన అన్నారు. మోదీ సర్కారు చేపట్టిన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీని మన్మోహన్ తప్పుబట్టారు. పెద్దనోట్ల రద్దు తప్పుడు పరిగణన అని, జీఎస్టీని ఆదరాబాదరాగా అమలుచేశారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment