ప్రసంగిస్తున్న మోత్కుపల్లి నర్సింహులు
యాదగిరిగుట్ట : తనను రాజకీయంగా అణచివేయడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. తాను ఏనాడు రాజ్యసభ, గవర్నర్ పదవులు అడగలేదని, ఆశపెట్టి మోసం చేసిండని మండిపడ్డారు. యాదగిరిగుట్టలో గురువారం జరిగిన ‘మోత్కుపల్లి శంఖారావ’ బహిరంగసభలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడారు. ప్రజల కోసమే జీవితమంతా బతుకుతానని, ఓ దుర్మార్గుడు, ఓ పాపత్ముడు, ఓ నీచుడిని నమ్మి మోసపోయానని చంద్రబాబునాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను రాజకీయాలపై, పేద ప్రజల పక్షాన మాట్లాడడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.
ఓ మిత్రుడా.. కేసీఆర్...
ఓ మిత్రుడా కేసీఆర్ నన్ను రాజకీయంగా వాడుకుని ఉంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లకు గానూ 10 అసెంబ్లీ సీట్లు గెలిపించి, పువ్వుల్లో పెట్టి ఇచ్చే వాడినని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు తప్ప మిగతావి ఏవీ గెలవవని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఇక్కడి ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే.. ఒక ఎమ్మెల్యే 2వందల ఎకరాల భూమి, మరొకరు 5వందల ఎకరాల భూమిని కోనుగోలు చేశారన్నారు. నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న కానీ ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదన్నారు. గతంలో ఆలేరులో ఎమ్మెల్యేగా ఉన్న బూడిద భిక్షమయ్యగౌడ్, తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితను గెలిపించింది తనేనని మోత్కుపల్లి పేర్కొన్నారు.
ఇవే నా చివరి ఎన్నికలు...
నా వయస్సు 65 సంవత్సరాలు.. ఇవే నా చివరి ఎన్నికలు.. ఈ ఒక్క సారి ఆశీర్వదించండని ఉద్వేగంగా మోత్కుపల్లి విజ్ఞప్తి చేశారు. ఆలేరు ప్రజలు అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గానికి సాగు జలాలు తీసుకుచచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. సిద్దిపేటకు తరలుతున్న తప్పాసుపల్లి జలాలను రాజపేట, ఆలేరు ప్రాంతాలకు తీసుకువస్తానని, గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను పూర్తి చేస్తానన్నారు. అంతే కాకుండా జిల్లాల విభజనలో జనగాంలో కలిసిన గుండాల మండలాన్ని తిరిగి యాదాద్రి జిల్లాలో కలిపే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ బహిరంగ సభలో ఎక్కడ కూడా కేసీఆర్‌ను విమర్శించకపోవడంతో స్థానికంగా చర్చ జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి వెంకన్న, యాదగిరిగుట్ట మాజీ సర్పంచ్ కైరంకొండ శ్రీదేవి, దడిగె ఇస్తారి, గజం ఉప్పలయ్య, పాపయ్య, చంద్రారెడ్డి, కే.ఆంజనేయులు, అమరేందర్‌రెడ్డి, గుంటి మధుసూదన్‌రెడ్డి, శ్రీరామూర్తి, దానయ్య, వెంకట్‌రెడ్డి, మచ్చ లక్ష్మీనారాయణ, ప్రజా చైతన్య వారధి పాపట్ల నరహరి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment