సాక్షి, మైసూరు: హనుమంతుని రాజ్యంలో రావణ పాలనను సాగిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్రంలో కుల, మత విద్వేషాలు చోటుచేసుకోవడానికి ముఖ్య కారకులవుతున్నారంటూ కేంద్రమంత్రి అనంతకుమార్ ఆరోపించారు. సోమవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిద్దరామయ్య నేతృత్వంలోని పాలన రావణ పాలనను తలపిస్తోందన్నారు. టిప్పు జయంతి, ఈద్‌మిలాద్, పీఎఫ్‌ఐ ఊరేగింపులకు అనుమతులిచ్చి, హనుమజ్జయంతి ఊరేగింపులను అడ్డుకుంటూ సిద్ధరామయ్య హిందూ మత వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు.
హనుమంతుని నాడుగా ప్రసిద్ధి చెందిన కర్ణాటకలో హనుమజ్జయంతి ఊరేగింపులకు అనుమతులు ఇవ్వకుండా సీఎం సిద్ధరామయ్య మత విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రుద్రేశ్, శరత్ మడివాళ ,రాజు, కుట్టప్ప తదితర 19 మంది హిందూ సంఘాల కార్యకర్తలు హత్యలకు గురైనా, హంతకులెవరో తెలిసినా కూడా మౌనం వహిస్తూ సిద్ధరామయ్య రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు.
హుణుసూరులో హనుమ భక్తులు, హిందూ సంఘాల కార్యకర్తలను అరెస్ట్ చేయించి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునేలా సీఎం సిద్దరామయ్య కుట్రలు చేశారని ఆరోపించారు. సీఎం కుట్ర పూరిత ఆదేశాలతో రాజ్యాంగం, చట్టాలను అతిక్రమించి జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఒక ఎంపీని అరెస్ట్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తాము తీవ్రంగా పరిగణించామని కలెక్టర్, ఎస్పీలు ఎంపీ హక్కులను ఉల్లంఘించిన ఘటనపై ఇదే నెల 15 నుంచి జరుగనున్న శీతాకాల పార్లమెంటరీ సమావేశాల్లో నిరసన తెలుపుతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment