
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఉదయం 7 గంటలకు రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. నేడు (మే 10) జరగనున్న రెండో దశలో 179 జెడ్పీటీసీ స్థానాలకు 805 మంది, 1,850 ఎంపీటీసీ స్థానాలకు 6,146 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ విడతలో ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రెండో విడత ఏకగ్రీవాల్లో ఒక ఎంపీటీసీ మినహా మిగతా స్థానాలన్నీ టీఆర్‌ఎస్ ఖాతాలో పడిన విషయం తెలిసిందే. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో నాలుగు గంటలకే ముగియనుంది. మొత్తం 10,371 పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఏర్పాటు చేసింది.