మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు (పాత చిత్రం)
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను చిన్న చూపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన వారిని చులకన చూస్తున్నందునే తమ నియోజక వర్గంలో బీటీ రోడ్ల పునరుద్దరణ జరపటంలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మిర్యాలగూడ ఎమ్మెల్యేగా గెలిచిన భాస్కర్‌రావు ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరారు. ఆయన బాటలోనే బీటీ రోడ్ల వ్యవహారంపై మరికొంత మంది ఎమ్మెల్యేలు పెదవి విరిచారు.
పదేళ్లుగా తన నియోజకవర్గంలో బీటీ రోడ్లు పునరుద్ధరణ చేపట్టలేదని, జరిగినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని అధికార పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డి వ్యాఖ్యానించటంతో ఆశ్చర్యపోవడం అధికార పార్టీ నేతల వంతైంది. పనిలోపనిగా తన నియోజకవర్గం కూడా వెనకబడిందని, బీటీ రోడ్ల పై దృష్టి పెట్టాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా కోరారు.
ఈ సమస్య అన్ని నియోజకవర్గాల్లో ఉందని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. బీటీ రోడ్లపై సభ్యుల ప్రశ్నలకు పంచాయతీరాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానాలిస్తారని చెప్పారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన పలువురు ఎమ్మెల్యేలు ఇమడలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా లేక సొంతగూటికి వెళ్లేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment