
మైసూర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
సాక్షి, బెంగళూర్ : సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మైసూర్‌లో ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కమీషన్ల సర్కార్‌గా అభివర్ణించారు. కమీషన్ల సర్కార్ కావాలో..మిషన్ ఉన్న ప్రభుత్వం కావాలో ప్రజలు తేల్చుకోవాలని పిలుపు ఇచ్చారు.
అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతి పనికీ పది శాతం కమీషన్ అడుగుతున్న సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. తమకు అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అంకితభావంతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. 2022 నాటికి స్వాతంత్ర్య సమరయోధులు స్వప్నించిన భారత్‌ను సాకారం చేసే దిశగా ముందుకు సాగుదామని కోరారు.
బీజేపీ అధికారంలోకి వస్తే బెంగళూర్-మైసూర్ జాతీయ రహదారిని రూ 6400 కోట్లతో విస్తరిస్తామని, మైసూర్‌లో రూ 800 కోట్లతో ప్రపంచస్ధాయి శాటిలైట్ కేంద్రాన్ని నెలకొల్పుతామని హామీ ఇచ్చారు.