గుత్తా సుఖేందర్‌రెడ్డి
సాక్షి, చిట్యాల (నకిరేకల్) : దేశ చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం చాలా గొప్ప విషయం. అలాంటిది ఓ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడి స్థాయి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎదిగారు చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన ప్రస్తుత నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి. ఈయన 1978లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1981లో ఉరుమడ్ల గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం 1984లో చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్‌గా నామినేట్ అయ్యారు.
1985లో మార్కెట్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1992లో చిట్యాల సింగిల్ విండో చైర్మన్‌గా గెలుపొందారు. 1992 నుంచి 99 వరకు వరసగా ఉరుమడ్ల గ్రామ పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్‌గా ఎన్నికై నల్లగొండ–రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల యూనియన్ చైర్మన్‌గా పనిచేశారు. 1995–99 వరకు ఏపీ డెయిరీ చైర్మన్‌గా పనిచేస్తూనే నేషనల్ డెయిరీ బోర్డు సభ్యుడిగా కొనసాగారు. 1995లో దేవరకొండ జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీచేసి విజయం సాధించారు.
ఎంపీగా..
1999లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి లోక్‌సభకు గుత్తా సుఖేందర్‌రెడ్డి మొట్టమొదటి సారి పోటీచేసి ఘన విజయం సాధించారు. 2004లో నల్లగొండ శాసనసభకు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం ఆయన 2009లో, 2014లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. కాగా నల్లగొండ ఎంపీగా మూడు సార్లు పనిచేసిన ఘనతను ఆయన సాధించారు. ఆయన ప్రస్తుతం గత ఏడాది కాలంగా క్యాబినేట్ హోదాలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంచెలంచెలుగా ఎదిగి ప్రజాసేవ చేస్తున్నారు.
10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ‘గుత్తా’ ప్రాతినిధ్యం
మిర్యాలగూడ : మూడు పర్యాయాలు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో 10 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం గుత్తా సుఖేందర్‌రెడ్డికే దక్కింది. ఆయన ఒకసారి టీడీపీ, మరో రెండు పర్యాయాలు కాంగ్రెస్ తరపున నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.1999లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుకుల జనార్ధన్‌రెడ్డిపై 79,735 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
కాగా అప్పట్లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉమ్మడి జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు నల్లగొండ, దేవరకొండ, మునుగోడు, భువనగిరి, ఆలేరు ఉన్నాయి. ఆ తర్వాత 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి సీపీఐ అభ్యర్థి సురవరం సుధార్‌రెడ్డిపై 1,52,982 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 2014లో టీడీపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డిపై 1,93,156 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాగా నియోజకవర్గాల పునర్విభజన అనంతరం నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట ఉన్నాయి. కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేవలం నకిరేకల్, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు మినహా 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment