వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి, చిత్రంలో శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఎర్రబోతుల తదితరులు
సాక్షి, కోవెలకుంట్ల/నంద్యాల: అవుకు మండలం ఉప్పలపాడుకు చెందిన చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబానికి ఐదు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది. చల్లా 1983వ సంవత్సరంలో పాణ్యం నియోజకవర్గం నుంచి ఒకసారి, 1999, 2004 సార్వత్రిక ఎన్నికల్లో కోవెలకుంట్ల నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా పనిచేసిన పదిహేనేళ్ల కాలంలో ఈ రెండు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ముఖ్యంగా అప్పటి కోవెలకుంట్ల నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న ప్రధాన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపారు.
కోవెలకుంట్లలో సీసీరోడ్లు, కుందూ నదిపై వంతెన, ఆయా మండలాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించిన ఘనత చల్లాకే దక్కింది. 1952 నుంచి కోవెలకుంట్ల నియోజకవర్గానికి 14 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా.. రెండు పర్యాయాలు, ఆపై గెలుపొందిన ఎమ్మెల్యేల్లో చల్లా నాల్గవ స్థానంలో నిలిచారు. 2009 ఎన్నికల సమయంలో పునర్విభజనలో భాగంగా కోవెలకుంట్ల నియోజకవర్గం కనుమరుగై.. బనగానపల్లెగా మార్పు చెందింది.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరుతున్న పోచా బ్రహ్మానందరెడ్డి, చిత్రంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పార్టీ నేతలు కాటసాని, గంగుల నాని తదితరులు
కోవెలకుంట్ల చివరి ఎమ్మెల్యేగానూ చల్లాకు అరుదైన గౌరవం దక్కింది. పునర్విభజన తర్వాత బనగానపల్లె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా.. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అప్పటి నుంచి నియోజకవర్గంలోని అవుకు, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల, సంజామల మండలాల్లో బలమైన కేడర్ కలిగిన నేతగా ఉంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో చల్లా టీడీపీలో చేరి.. బనగానపల్లె అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి గెలుపునకు తీవ్రస్థాయిలో కృషి చేశారు.
తదనంతర పరిణామాల్లో చల్లాకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, పార్టీలో సముచితస్థానం కల్పించకపోవడంతో ఇటీవలే టీడీపీ సభ్యత్వానికి, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య, పాణ్యం, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, బనగానపల్లె నియోజకవర్గ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, గుండం ప్రకాష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం
చల్లా రామకృష్ణారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలోని ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. చల్లాతో పాటు తనయుడు చల్లా భగీరథ్‌రెడ్డి, సోదరులు చల్లా సూర్యప్రకాష్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, అమర్‌నాథరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రఘునాథరెడ్డి, కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లోని ముఖ్య అనుచరులు చేరారు. ఇప్పటికే నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి బలంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చల్లా చేరికతో మరింత బలం పెరిగింది.
సుపరిచితుడు పోచా
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన పోచా బ్రహ్మానందరెడ్డి రైతు కుటుంబంలో జన్మించారు. నంద్యాలలో భారతీ సీడ్స్ స్థాపించి రైతులకు చేదోడు వాదోడుగా నిలిచారు. నంది రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడిగా రైతు సమస్యలపై పోరాటాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకవర్గ సభ్యులుగా పని చేశారు. రెండేళ్ల క్రితం బీజేపీలో చేరి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పని చేశారు. ప్రస్తుతం బీజేపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే రైతుల జీవితాలు బాగుపడతాయని పోచా బ్రహ్మానందరెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న వైఎస్ జగన్ తపన, ఆరాటం చూసి.. ఆయన్ను సీఎం చేసుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతో వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు. జగన్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ నంద్యాల పార్లమెంట్ పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. వైఎస్సార్ సువర్ణ యుగం మళ్లీ రావాలంటే జగన్‌ను సీఎం చేసుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment