సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను డిజిటల్ కెమెరాను 1987–1988 ప్రాంతంలో ఉపయోగించాను. అప్పుడు చాలా తక్కువ మందికి ఈ మెయిల్ సర్వీసు అందుబాటులో ఉండేది. ఒక రోజు వీరంగమ్ తెహసిల్‌లో (గుజరాత్) అద్వానీ బహిరంగ సభ జరుగుతుందంటే అక్కడికి నేను నా డిజిటల్ కెమెరాను తీసుకొని వెళ్లాను. ఇప్పట్లాగా కాకుండా అప్పట్లో ఆ కెమేరా చాలా పెద్దగా ఉండేది. అద్వానీ సభలో ప్రసంగిస్తున్న దశ్యాన్ని ఫొటో తీసి వెంటనే దాన్ని నేను ఢిల్లీకి ట్రాన్సిమిట్ చేశాను. ఆ మరుసటి రోజు ఉదయమే ఆయన కలర్ ఫొటో అచ్చయింది. ఒక్క రోజులోనే ఆయన ఫొటో అచ్చవడం చూసి అద్వానీ ఆశ్చర్యపడ్డారు’ అని ప్రధాని నరేంద్ర మోదీ ‘న్యూస్ నేషన్’ అనే హిందీ టెలివిజన్ ఛానెల్‌కు మే 11వ తేదీన ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
డిజిటల్ కెమేరా 1991లో మార్కెట్‌లోకి
ప్రపంచంలోనే తొలి కమర్శియల్ డిజిటల్ కలర్ కెమెరా ‘కొడాక్ 100’ 1991లో మార్కెట్‌లోకి వచ్చింది. అప్పటికీ భారత్‌లో ఇంటర్నెట్ సర్వీసు అందుబాటులో లేదు. ఫొటోలు, చిత్రాలు కాకుండా కేవలం టెక్ట్స్(లిపి)ని మాత్రమే పంపించే ఈ మెయిల్ సర్వీస్‌ను భారత ప్రభుత్వం 1995, ఆగస్టు 15వ తేదీన ప్రారంభించింది. 1998లో ప్రైవేటు కంపెనీలు ఈ మెయిల్ సర్వీసులను ప్రారంభించాయి. 1987లో కమర్శియల్‌గా ఎలాంటి డిజిటల్ కెమెరా అందుబాటులో లేనేలేదని ‘మీడియా అండ్ డిజిటల్’ కన్సల్టెంట్ ప్రశాంతో కుమార్ రాయ్ తెలిపారు.
‘కొడాక్ ఫస్ట్ డిజిటల్ మూవ్‌మెంట్’ శీర్షికతో ‘న్యూయార్క్ టైమ్స్’ 2015లో రాసిన ఓ వార్తా కథనం ప్రకారం ప్రపంచంలోనే తొలి బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ కెమెరాను కొడాక్ ఇంజనీరు స్టీవెన్ సాసన్ 1975లో కనుగొన్నారు. 0.1 మెగా పిక్సల్ కలిగిన దీన్ని ‘ఎలక్ట్రానిక్ స్టిల్ కెమెరా’గా పేర్కొంటూ 1978లో పేటెంట్ తీసుకున్నారు. అప్పటి వర కు ఈ కెమెరాను కనుగొన్న విషయాన్ని బయటకు చెప్పకుండా ఇంజనీరు స్టీవెన్‌ను కట్టడి చేశారు. డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాను 1989లో స్టీవెన్ సాసన్, రాబర్ట్ హిల్స్ కనిపెట్టారు. అయితే అది కూడా వెంటనే మార్కెట్‌లోకి రాలేదు. అంతుముందు 1986లోనే మెగా ఫిక్సల్ డిజిటల్ కెమెరా ‘ప్రోటోటైప్’ను తయారు చేశారు. అంటే, ప్రపంచంలోనే అది ఒక్కటే కెమెరా ఉంటుంది. దాని కమర్షియల్ మోడల్ కొడాక్ డీసీఎస్ (డిజిటల్ కెమెరా సిస్టమ్) 100, 1.3 మెగాఫిక్సల్ సామర్థ్యంతో 1991లో ప్రపంచ మార్కెట్‌లోకి వచ్చింది. ‘నికాన్ ఫిల్మ్ కెమెరా’ బాడీలో దాన్ని అమర్చారు. దాన్ని పదివేల డాలర్ల నుంచి 20వేల డాలర్ల వరకు ఉపయోగించారు.
భారత్‌లో ఇంటర్నెట్ సదుపాయం
భారత ప్రభుత్వరంగ సంస్థ ‘విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (వీఎస్‌ఎన్‌ఎల్)’ సంస్థ 1995, ఆగస్టు 15వ తేదీన దేశంలో ఇంటర్నెట్ సర్వీసును ప్రారంభించింది. దాంతో ఈ మెయిల్ ద్వారా సమాచారాన్ని పంపుకునే సౌకర్యం అందుబాటులోకి మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చిందికానీ ఫొటోలను పంపుకునే సామర్థ్యం అప్పటికీ రాలేదు. ఈ రంగంలోకి ప్రవేటు కంపెనీలను 1998లో భారత ప్రభుత్వం అనుమతించింది. 2008లో టాటా గ్రూప్ వీఎస్‌ఎన్‌ఎల్‌ను కొనుగోలు చేసుకుంది. తర్వాత దాన్ని టాటా కమ్యూనికేషన్లుగా మార్చుకుంది. 1992లో ఈఆర్‌ఎన్‌ఈటీ (ఎడ్యుకేషన్ అండ్ రీసర్ట్ నెట్‌వర్క్), బిజినెస్ ఇండియా యాక్సెస్ పేరిట దేశంలో రెండు ఈ మెయిల్ సర్వీసులు ఉండేవి. ఒకటేమో అకాడమిక్ సంస్థల మధ్య ఈ మెయిళ్లుకు, రెండోది వ్యాపార సంస్థలకు మధ్య ఈ మెయిళ్ల కోసం ఈ రెండు నెట్‌వర్క్‌లు పనిచేశాయి. అవి అప్పుడు అత్యంత ఖరీదైనవి. వాటికి కూడా ఫొటోలు పంపించే సౌకర్యం లేకుండే.
మోదీ ఏ పద్ధతి ఉపయోగించారో!
1986–87 సంవత్సరాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే ప్రధాని నరేంద్ర మోదీ ఏ పద్ధతిన ఢిల్లీకి డిజిటల్ ఫొటోను పంపించారంటూ నెటిజన్లు జోకులు వేసుకుంటున్నారు. మోదీ తన ఇంటర్వ్యూలో ట్రాన్సిమిట్ చేశానని చెప్పారుగానీ ఏ పద్ధతిన ట్రాన్సిమిట్ చేశారో చెప్పలేదు. తెలుసుకొని వివరించాల్సిందిగా ‘బీజేపీ సమాచార, సాంకేతిక విభాగం’ అధిపతి అమిత్ మాల్వియాకు మీడియా ఈ మెయిల్ పెట్టింది. ఇంతవరకు ఆయన నుంచి సమాధానం రాలేదు. ఈ మెయిల్ ఎక్స్ఛేంజ్‌కు 1986లోనే డైలప్ లింక్ పద్ధతి అనేది ఒకటి ఉండేది. అది కూడా ‘నేషనల్ సెంటర్ ఫర్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ (ఎన్‌సీఎస్‌టీ), ముంబై ఐఐటీ మధ్యనే ఉండింది. 1987లో మద్రాస్ ఐఐటీ, ఢిల్లీ ఐఐటీ మధ్య అలాంటి డైలప్ లింక్‌ను ఏర్పాటు చేశారు. ఈ పద్ధతికి డయల్ చేయడానికి ఓ కంప్యూటర్, దాన్ని మోడమ్ ద్వారా రిసీవ్ చేసుకోవడానికి మరో కంప్యూటర్ ఉంటే చాలు. వాటి ద్వారా ఈ మెయిళ్లను పంపించడమే కాకుండా మాట్లాడుకునే సౌకర్యం కూడా ఉంది.
ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు!
ప్రధాని నరేంద్ర మోదీనే తన పాత జ్ఞాపకాలకు కొత్త టెక్నాలజీని జోడించి మాట్లాడుతున్నారా? ఎవరో తెలిసీ తెలియక రాసిస్తున్న ‘స్క్రిప్టు’ను ఆయన అనుసరిస్తున్నారా? చెప్పే మాటలు వింటారు తప్పించీ, లోతుల్లోకి వెళ్లి ఎవరు నిజానిజాలను చూస్తారులే అన్న అభిప్రాయమా ? ఏదైమైనా చరిత్ర గురించి, సైన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన తప్పులోనే కాలేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment