
అహ్మదాబాద్ : త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో ఈ నెల 22న ప్రధాని మోదీ మరోసారి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భావ్‌నగర్, వడోదర జిల్లాల్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నెలలో ఇప్పటికే రెండు సార్లు ప్రధాని గుజరాత్‌లో పర్యటించారు. భావ్‌నగర్ జిల్లాలోని ఘోఘా, భరూచ్ జిల్లాలోని దహేజ్‌ల మధ్య ‘రోల్–ఆన్ రోల్–ఆఫ్’ ఫెర్రీ(వాహనాల్ని తరలించేందుకు) సేవల్ని ప్రారంభిస్తారు. ఘోఘాలో ప్రసంగించిన అనంతరం.. దహేజ్ నుంచి ఘోఘా వరకూ ఫెర్రీలో ప్రయాణిస్తారు. అనంతరం దహేజ్ నుంచి వడోదర వెళ్తారు. అక్కడ రూ. 1,140 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం నవ్‌లఖీ మైదానంలో ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
గుజరాత్ షెడ్యూల్‌ను మోదీయే ప్రకటిస్తారేమో..: చిదంబరం
న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయకపోవడంపై కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కేంద్ర ఎన్నికల సంఘంపై మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన ర్యాలీ కోసమే ఎన్నికల షెడ్యూల్‌ను ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం మోదీ కనుసన్నల్లో నడుచుకుంటోందని శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. గుజరాత్‌లో తలపెట్టిన తన చివరి ర్యాలీలో ప్రధాని మోదీ ఎన్నికల షెడ్యూల్‌నూ ప్రకటిస్తారేమోనని చిదంబరం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment