మోదీని ఏ ఒక్కరూ ప్రశ్నించరు: సిద్దూ | Navjot Singh Sidhu Says No One Questions PM Modi Over His Controversial Pak Visit | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 21 2018 3:23 PM | Last Updated on Tue, Aug 21 2018 3:27 PM

Navjot Singh Sidhu Says No One Questions PM Modi Over His Controversial Pak Visit - Sakshi

నవజోత్ సింగ్ సిద్ధూ

చండీఘఢ్‌ : పాకిస్తాన్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి హాజరై విమర్శలను ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ స్పందించారు. ప్రతి ఒక్కరు అనవసరంగా తనను విమర్శిస్తున్నారని, అంత పెద్ద తప్పుచేయలేదని తన చర్యలను సమర్థించుకున్నారు. పాక్‌ ప్రధాని ప్రమాణాస్వీకార కార్యక్రమంలో చివరి నిమిషంలో ముందు వరుసలో కూర్చోవాల్సి వచ్చిందన్నారు. మాజీ ప్రధాని దివంగత నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి సైతం పాకిస్తాన్‌కు బస్సు యాత్ర చేశారని, ప్రధాని నరేంద్ర మోదీ 2015లో లాహోర్‌కు వెళ్లి అప్పటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను కౌగిలించుకున్నారని గుర్తుచేశారు. షరీఫ్‌ సైతం మోదీ ప్రమాణస్వీకారానికి హజరయ్యారన్నారు. 

అప్పడు లేవని నోర్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు. ప్రధాని మోదీని ఏ ఒక్కరూ ఎందుకు ప్రశ్నించలేదని అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, కొందరు కాంగ్రెస్‌ నేతలు సైతం విమర్శిస్తున్నారని సిద్దూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా వారి అభిప్రాయాలను చెప్పవచ్చన్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ నుంచి 10 సార్లు ఇన్విటేషన్‌ అందిందని, తాను భారత ప్రభుత్వం అనుమతి తీసుకొని హాజరయ్యానని స్పష్టం చేశారు.

ఇక పాక్‌ ఆర్మీ చీఫ్‌ను కౌగిలంచుకోవడంపై స్పందిస్తూ.. ‘సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా పాకిస్థాన్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ కారిడార్‌ను తెరవడానికి  సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నేను ఆప్యాయంగా మాట్లాడుతూ కౌగిలించుకున్నాను. అందులో తప్పేం ఉంది’  అని సిద్ధూ పేర్కొన్నారు. కాగా పాక్‌ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం పట్ల పంజాబ్‌ సీఎం అమరీందర్ సింగ్ విముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సిద్ధూ చర్య సరైనది కాదని, పాక్‌ ఆర్మీ చీఫ్‌ పట్ల అంతటి అభిమానం చూపించడం తప్పని ఆయన పేర్కొన్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రధాని పక్కన సిద్దూ కూర్చోవడం కూడా భారతీయులు తట్టుకోలేకపోయారు. దీంతో అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఆయన శాంతి దూత: పాక్‌ ప్రధాని
మరోవైపు సిద్ధూపై పాక్‌ నూతన ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రశంసల జల్లు కురిపించారు. అతనొక శాంతి దూత అని కొనియాడారు. తన ప్రమాణస్వీకారినికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలిపారు. భారత్‌లో అతన్ని టార్గెట్‌ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. శాంతి లేకుంటే ఇరుదేశాల్లో పురోగతి ఉండదని వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement