సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోలేక పోయింది. దీంతో దేశ వ్యాప్తంగా బీజేపీ, నరేంద్ర మోదీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయనే భావనలు మొదలయ్యాయి. అయితే, ఇండియా టుడే బిహార్‌లో చేసిన తాజా సర్వేలో బీజేపీకి ఊరట కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. సర్వే వివరాల ప్రకారం.. బిహార్‌లో ప్రధాని మోదీ పాపులారిటీ పెరిగింది. సెప్టెంబర్‌లో 58 శాతం ఉన్న మోదీ పాపులారిటీ, అక్టోబర్‌లో 60, నవంబర్‌లో 61 శాతానికి పెరిగింది. అలాగే, కేంద్ర ప్రభుత్వ పనితీరుపై 60 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేశారు. మూడు పెద్ద రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీజేపీకి వచ్చే సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ ఈ విషయం కాస్త ఊరట కలిగించేదే.
నితీష్ అదరహో..
నితీష్ కుమార్ ప్రభుత్వానికి కూడా సానుకూల ఫలితాలు వచ్చాయి. జేడీయూ-బీజేపీ ప్రభుత్వ పనితీరుపట్ల 53 శాతం మంది సంతృప్తిగా ఉన్నట్టు సర్వేలో తేలింది. ఇక ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసకుని బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్‌కుమార్ పాపులారిటీ తగ్గలేదు. సెప్టెంబర్‌లో 46, అక్టోబర్‌లో 48, నవంబర్‌లో 49 శాతం పాపులారిటీతో నితీష్‌కు మంచి స్కోరు సాధించారు. 40 లోక్‌సభ స్థానాలున్న బిహార్‌లో బీజేపీ-జేడీయూకు అనుకూల పవనాలు వీయడం బీజేపీకి కలిసొచ్చే అంశం.
మహాకూటమి విచ్ఛిన్నం..
బిహార్ అసెంబ్లీకి 2015, నవంబర్‌లో ఎన్నికలు జరిగాయి. ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్‌లు మహాకూటమి పేరుతో ఎన్నికల బరిలో నిలిచి 178 సీట్లు సాధించాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ 243 స్థానాలున్న అసెంబ్లీలో కేవలం 53 స్థానాలకే పరిమితమైంది. అయితే, రెండేళ్ల పాలన అనంతరం మహా కూటమి కథ ముగిసింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూటమి నుంచి బయటకొచ్చి బీజేపీ సహకారంతో తిరిగి ప్రభుత్వాన్ని నెలకొల్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతోనే మహాకూటమి నుంచి వైదొలిగినట్టు నితీష్ చెప్పారు. ఇదిలాఉండగా.. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధానిగా నరేంద్ర మోదీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి నితీష్‌కుమార్ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. మహాకూటమి నుంచి బయటకొచ్చి తిరిగి ఎన్డీయేలో చేరడంతో నితీష్‌పై మొదట్లో విమర్శలు వచ్చాయి.
ఉత్తరప్రదేశ్‌లో మరోలా..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాపులారిటీ రోజురోజుకీ తగ్గుతోంది. సెప్టెంబర్ నెలలలో 43 శాతం ఉన్న యోగి పాపులారిటీ నెలగడిచే సరికి 38 శాతానికి పడిపోయింది. దీంతో అక్కడ బీజేపీకి గడ్డుగాలం ముంచుకొస్తోందని ఆ పార్టీ శ్రేణులు మదనపడుతున్నారు. 4,140 మంది శాంపిల్స్‌తో టెలిఫోనిక్ సర్వే నిర్వహించగా ఈ ఫలితాలు వెల్లడయ్యాయని ఇండియా టుడే-పొలిటికల్ స్టాక్‌ఎక్చేంజ్ రిపోర్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment