
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. మోదీ ప్రభుత్వానికి ఆయన జై కొట్టారు. విద్యా, ఆరోగ్యం, వ్యవసాయం విషయంలో మోదీ ప్రభుత్వం చెప్పుకోదగిన కేటాయింపులు చేసిందని కొనియాడారు. ముఖ్యంగా జాతీయ ఆరోగ్య భద్రతా పథకం భేష్ అని నితీష్ అన్నారు. ఈ పథకం ద్వారా దేశంలో 10 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని ఇదో పెద్ద ముందడుగు అని నితీష్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తాను ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.
కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2018-19 ఏడాదికిగాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం 11గంటలకు మొత్తం బడ్జెట్ రూ.21.57లక్షల కోట్ల బడ్జెట్‌ను జైట్లీ ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు మేక్ ఇన్ ఇండియా, సేవా రంగాలు, పరిశ్రమల స్థాపన అంటూ పరుగులు పెట్టించిన మోదీ 2019లో సాధారణ ఎన్నికల నేపథ్యంలో వ్యవసాయ రంగం, గ్రామీణం, సంక్షేమ రంగాలపై దృష్టిని సారించి కేటాయింపులు జరిపారు.