సాక్షి, అమరావతి బ్యూరో: తెలుగుదేశం పార్టీలో అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎంపిక చేసే అభ్యర్థుల విషయంలో మహిళలకు అవకాశం కల్పించకుండా చిన్నచూపు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో మహిళలకు పెద్ద పీట వేశామని, 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావటం లేదు. గత సార్వత్రికల ఎన్నికల సమయంలో జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక్క మహిళకూ అవకాశం కల్పించలేదు. పార్లమెంట్ స్థానాల విషయంలోనూ మొండి చేయి చూపారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సైతం గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కొన్ని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారు. ఇందులోనూ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి మహిళలను పరిగణనలోకి తీసుకోలేదు. పార్టీలో కులాలకు, డబ్బు ఉన్న వారికే ప్రాధాన్యత కల్పిస్తున్నారని, అందువల్లనే మహిళలకు సముచిత స్థానం లభించటం లేదని.. ఆ పార్టీ మహిళా నాయకులు విమర్శిస్తున్నారు. ఎంత కష్టపడినా పార్టీలో తమకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు పెద్ద పీట
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మహిళలకు పెద్ద పీట వేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో ప్రత్తిపాడు, తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలకు సీటిచ్చారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సైతం మహిళలకు సముచిత స్థానం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో విడదల రజని, తాడికొండ నియోజకవర్గంలో డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, ప్రత్తిపాడు నియోజకవర్గంలో మేకతోటి సుచరిత పార్టీ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పదవులతోపాటు, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగిన సమయంలో, ఇలా అన్ని విషయాల్లోనూ మహిళలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేసింది. పార్టీ కార్యక్రమాల్లో గౌరవం కల్పిస్తున్నారనే భావన మహిళ కార్యకర్తల్లో నెలకొంది. దీంతో జిల్లా వ్యాప్తంగా మహిళలు వైఎస్సార్ సీపీకి మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment