సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. సోమవారం మొత్తం 2,087 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఇప్పటివరకూ దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 3,584కు చేరింది. చివరి రోజు నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల్లో మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు కె.జానారెడ్డి, డీకే అరుణ, రేవంత్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య తదితరులు ఉన్నారు. నామినేషన్లను మంగళవారం రిటర్నింగ్ అధికారులు పరిశీలించి అర్హులైన వారి నామినేషన్లను ఆమోదించనున్నారు. ఏమైనా లోపాలు ఉంటే అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 22న ముగియనుంది. నామినేషన్ దాఖలు సందర్భంగా ఎవరేమన్నారంటే...
గెలిచినా రాజీనామా చేస్తా: వెంకట్‌రెడ్డి
నల్లగొండ జిల్లాలో 10 మంది టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని కొందరు పేర్కొంటున్నారని, అదే జరిగితే తాను ఎమ్మెల్యేగా గెలిచినా పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.
కొడంగల్ వైపు చూస్తే మసైపోతారు: రేవంత్
‘కొడంగల్ నియోజకవర్గం చుట్టూ రేవంత్‌రెడ్డి అనే హైటెన్షన్ విద్యుత్ కంచె అనుక్షణం కాపలా కాస్తోంది. ఇందులోకి రావాలని ప్రయత్నించే వారెవరైనా మాడి మసైపోతారు’అని రేవంత్‌రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా వ్యాఖ్యానించారు.
కేసీఆర్ మోసం చేశారు: డీకే
నడిగడ్డ ప్రాంతంలో ఎస్టీ జాబితా పేరుతో బోయ, వాల్మీకులను, 12 శాతం రిజర్వేషన్ల పేరుతో ముస్లిం మైనారిటీలను, లంబాడీలను కేసీఆర్ మోసం చేశారని డీకే అరుణ మండిపడ్డారు. కొద్దిపాటి పనులు చేస్తే పూర్తయ్యే నెట్టెంపాడు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
సోమవారం వరకు దాఖలైన నామినేషన్లు
కాంగ్రెస్ 135, బీజేపీ 128, సీపీఎం 28, సీపీఐ 3, ఎన్‌సీపీ 21, బీఎస్పీ 112, టీఆర్‌ఎస్ 116, టీడీపీ 20, ఏఐఎంఐఎం 13, మొత్తం = 576, స్వతంత్రులు–ఇతరులు 1,511.
‘నిమిషం’ఎఫెక్ట్...
నిమిషం లేటు నిబంధన ప్రవేశ పరీక్షల్లోనే కాదు.. నామినేషన్ వేసే అభ్యర్థులకూ వర్తించింది. ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి నిమిషం ఆలస్యంగా రావడంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె. విన్‌స్టెన్ నామినేషన్ వేయకుండానే వెనుతిరగాల్సి వచ్చింది.
పొన్నాల కంటతడి
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారిగా కంటతడి పెట్టారు. 35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నానంటూ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment