
మంత్రి జగదీశ్ రెడ్డి( పాత చిత్రం)
నల్గొండ : తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. నల్గొండ సభలో కాంగ్రేస్ నేతల ప్రసంగాలపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. మోరీలలో పడేది టిఆర్‌ఎస్‌స్ కార్యకర్తల తలలు కాదని..కాంగ్రెస్ పార్టీ నేతల పదవులు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మీ బాషను మార్చుకోకపోతే ప్రజలే కాంగ్రెస్ నేతల బట్టలు పీకి మోరీలలో వేసే రోజులు ముందున్నాయన్నారు. అటువంటి బాషను వాడుతున్నప్పుడు వేదిక మీద ఉన్న సీనియర్ నేత జానారెడ్డి వారించకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ నేతల మాటలతో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంటుందని వ్యాఖ్యానించారు.
తాగి తన్నుకున్న పంచాయతీలో టీఆర్‌ఎస్‌ను లాగి బదనాం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ కార్యకర్తల తలలు తెంపి మోరీలలో మొండేలను వేస్తాం..ఎంఎల్‌ఏలను బట్టలు విప్పి కొడతామంటూ వాడిన పదాలు కాంగ్రెస్ పార్టీ సంస్కృతిని, వేదిక మీద ఉన్న జానా, ఉత్తమ్, జైపాల్ వంటి నేతల నాయకత్వానికి అద్దం పడుతున్నాయని విమర్శించారు. 2019 ఎన్నికలలో మీ బట్టలు విప్పి మీరు చెప్పిన మోరీలలో వేసేందుకు ప్రజలే సన్నద్దమవుతున్నారని అన్నారు.