చంపుతామంటున్నారు: కోమటిరెడ్డి
తాను ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతుంటే టీఆర్‌ఎస్ నేతలు చంపుతామని బెదిరిస్తున్నారని అయినా భయపడేది లేదని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో ఓవర్‌హెడ్ ట్యాంక్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి చెందిన కౌన్సిలర్లను, ఎంపీటీసీలను, తనను కూడా చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు.
చావడానికైనా భయం లేదని తాను దేనికీ భయపడే వ్యక్తిని కాదని, కార్యకర్తలకు ఏమవుతుందోనని ఆందోళన కలుగుతోందన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని, అలాంటిది తనపైనే బెదిరింపులకు పాల్పడటం చూస్తే బాధ కలుగుతోందన్నారు. తమపైన దౌర్జన్యాలు చేయడం సరైంది కాదని ఎవరైనా ప్రజల కోసం పనిచేసి మంచిపేరు తెచ్చుకోవాలన్నారు. వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించకుండా అధికారులను కూడ బెదిరించారని, మున్సిపల్ ఈఈనిచెప్పడానికి వీలులేని భాషలో దూషించారన్నారు.
వాటర్‌ట్యాంక్ ప్రారంభోత్సవానికి రాకుండా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి బెదిరించడం శోచనీయమన్నారు. వారం రోజుల క్రితం అదనపు డీజీపీని కలిసి అన్ని విషయాలు వివరించానని తెలిపారు. తానంటే సీఎంకు గౌరవం ఉందని, కానీ నల్లగొండలో దానికి విరుద్ధంగా నడుస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండలో జరుగుతున్న ఘటనలపై రిపోర్టు తెప్పించుకొని చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఎండలు తీవ్రంగా పెరిగిపోయి ప్రజలకు మంచినీరు, పశువులకు గడ్డి దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఏఎమ్మార్పీ ద్వారా నీటి విడుదల చేసి చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతానని తెలిపారు. సాగర్ నీళ్లు హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నారని కానీ జిల్లాలో మాత్రం సరఫరా కావడం లేదన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ ఉన్నారు.