
శ్రీనుకుమార్, శ్రీనివాసమూర్తి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రజలకు సేవ చేసేందుకే ప్రభుత్వాధికారులనేది పైకి చెబుతున్నమాటేగాని వాస్తవంగా వారుండాల్సింది ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే అని అధికారపార్టీ రుజువుచేస్తోంది. డ్వామా, రెవెన్యూ డివిజనల్ అధికారి పోస్టులతో జిల్లా మంత్రులతో పాటు ఇన్‌చార్జి మంత్రి మూడు ముక్కలాట ఆడేసుకుంటున్నారు. జిల్లాకు వచ్చిన మర్నాడే పీడీని వెనక్కి పంపేస్తే... కొత్త ఆర్డీవో విధుల్లోకి చేరిన రోజే ఇంటి ముఖం పట్టేలా చేశారు. మంత్రులు చెప్పినట్లు నడుచుకోవడానికి అభ్యంతరం లేనప్పటికీ ఏ మంత్రి చెప్పినట్లు నడుచుకోవాలో జిల్లా కలెక్టర్‌కు పాలుపోని పరిస్థితి ఏర్పడింది. కాగా అధికారులను విధుల్లో చేరనివ్వకపోవడానికి జిల్లా రాజకీయాలే కారణమనే విషయం ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశమైంది.
నాలుగురోజుల్లోనే డ్వామా పీడీ వెనక్కి
డ్వామా పీడీగా కృష్ణా జిల్లా నుంచి బి.రాజగోపాల్ గత నెల ఒకటో తేదీన విజయనగరం జిల్లాకు బదిలీపై వచ్చారు. ఆయన్ను జిల్లా కలెక్టర్ విధుల్లోకి తీసుకోలేదు. బదిలీ అయిన మరునాడు రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావును రాజగోపాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఇంతలోనే ఏమైందో ఏమో ఆయన విధుల్లో చేరకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. తర్వాత నాలుగు రోజులకు ఆయన బదిలీ ఉత్తర్వులు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
విజయనగరం ఆర్డీవోదీ అదే దారి
విజయనగరం కొత్త ఆర్డీవో జి.శ్రీనుకుమార్ చేరికలోనూ నాటకీయ పరిణామాలు చోటు చేసుచేసుకున్నాయి. విజయనగరం ఆర్డీవోగా పని చేస్తున్న ఎస్.శ్రీనివాసమూర్తికి విజయవాడ అర్‌అండ్‌ఆర్ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో పది నెలలుగా పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న శ్రీనుకుమార్‌ను నియమించారు. ఆయన విధుల్లో చేరేందుకు విజయనగరం వచ్చి జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్‌ను కలవగా తర్వాత రమ్మని చెప్పి పంపించేశారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ముగియడంతో ఈ నెల 4వ తేదీన శ్రీనుకుమార్ ఆర్డీవో కార్యాలయానికి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు బదలాయింపులో భాగంగా సీటీసీపై సంతకం కూడా చేర్చారు. కానీ ఏమి జరిగిందో ఏమో పాత ఆర్డీవో కొనసాగుతారని, కొత్త ఆర్డీవో చేరిక రద్దయిందన్న సమాచారం కార్యాలయ సిబ్బందికి అందింది. సీటీసీని చించేసి శ్రీనుకుమార్ వెనక్కి వెళ్లిపోయారు.
మంత్రుల మధ్య ఆధిపత్య పోరువల్లే...
ఈ రెండు సంఘటనల్లో కేంద్ర మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రితో పాటు జిల్లా మంత్రి మధ్య అధిపత్యపోరు ప్రధాన కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. డ్వామా పీడీగా వచ్చిన రాజగోపాల్‌ను వెనక్కి పంపడానికి అసలు కారణం ఆయన చినబాబు ఆశీస్సులతో నేరుగా రావడమేనట. జిల్లా మంత్రికి తెలియకుండా, ఆయనను ముందుగా ప్రసన్నం చేసుకోకుండా విధుల్లో చేరేందుకు రావడం మన మంత్రికి నచ్చకపోవడం వల్ల ఆయన ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇక ఆర్డీవో జి.శ్రీనుకుమార్ కూడా జిల్లా మంత్రుల ప్రమేయం లేకుండా వచ్చారు. దీంతో కేంద్ర మంత్రి నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడం వల్లనే అప్పటికప్పుడు కలెక్టర్ నిర్ణయం తీసుకుని ఆర్డీఓను విధుల్లో చేర్చుకోలేదని సమాచారం. ఇప్పుడు జిల్లా మంత్రి కూడా కొత్త ఆర్డీఓకు తమ మద్ధతు తెలుపుతూ ఆశోక్‌ను ధిక్కరించే పనిలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈ ముగ్గురు మంత్రుల ఆధిపత్యపోరువల్లే... జిల్లాకు ఉన్నతాధికారులను రానివ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.