
విజయవాడ సీటీ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని హత్యచేసేందుకే ఆయనపై దాడి జరిగిందని రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టమైన నేపథ్యంలో చంద్రబాబుకు వంతపాడుతూ తప్పుడు ప్రకటన చేసిన డీజీపీ ఠాకూర్ లెంపలేసుకుని.. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ డిమాండ్ చేశారు. అసత్య ప్రచారాలు చేసిన టీడీపీ నేతలు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ కత్తి మెడమీద తగిలి ఉంటే చనిపోయేవారనేది కూడా రిమాండ్ రిపోర్టులో స్పష్టమైందన్నారు. మీడియా ముందుకొచ్చి వెకిలి నవ్వు, చేష్టలతో మానవత్వం లేని ఓ మృగంలా మాట్లాడిన చంద్రబాబు.. ఈ రిపోర్ట్‌పై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే.. నిజనిజాలు తెలుసుకోకుండా ప్రచారార్భాటం, సానుభూతి కోసం అంటూ బాధ్యత మరిచి తన పోస్టుకే మచ్చతెచ్చేలా మాట్లాడిన డీజీపీ సిగ్గుతో లెంపలేసుకోవాలన్నారు.
సానుభూతి కోసం బాబు కుట్ర: రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ ఢిల్లీకి పోయి శోకాలు పెడుతున్న చంద్రబాబే.. వాస్తవంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అలజడులు స్పష్టించి సానుభూతి కోసమే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారన్న నిజం బట్టబయలైందన్నారు. ప్రజలు తనను గద్దె దింపడానికి నాలుగు నెలలే ఉండటంతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు, అల్లర్లకు వ్యూహ రచన చేస్తున్నారని ఆరోపించారు. ఆపరేషన్ గరుడని స్పష్టించింది నువ్వు కాదా బాబూ అంటూ ప్రశ్నించారు.
శివాజీ మూడు నెలల కిందటే విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టి ఆపరేషన్ గరుడ ఎలా జరగనుందో చెబితే.. పోలీసు, ఇంటిలిజెన్స్ వ్యవస్థలు చేతులు ముడుచుకుని ఎలా కూర్చున్నాయని ప్రశ్నించారు. టీడీపీకి తొత్తు అయిన శివాజీని అరెస్ట్‌చేసి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. జగన్‌పై దాడి చేసిన శ్రీనివాస్‌రావు తెలుగుదేశం క్రియాశీలక కార్యకర్త అనే సంగతి ఆధారంతో సహా బయటపడిందని, అతని వెనుక పాత్రధారులు, సూత్రధారులు, కుట్రదారులెవరో వెలికితీయాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment