విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న జోగి రమేష్. చిత్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు
సాక్షి, గుంటూరు/పట్నంబజారు (గుంటూరు): రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీని అణచివేయడానికి చంద్రబాబు సర్కార్ కుయుక్తులు పతాక స్థాయికి చేరాయి. ప్రతిపక్ష పార్టీ నేతల్ని నయానో, భయానో లొంగదీయడానికి సర్వ విధాలా ప్రయత్నిస్తోంది. ఒకపక్క భౌతిక దాడులు చేస్తూ.. మరోపక్క కేసులతో వేధిస్తోంది. దానిలో భాగంగానే వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌పై విచారణ పేరుతో వేధింపులకు దిగారు. మంగళవారం ఆయన్ను గుంటూరులోని అరండల్‌పేట పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం చేసిన నిందితుడి విషయంలో జోగి రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడితే.. దానిపై గత నెల 28న టీడీపీ నేత వర్ల రామయ్య గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రమేష్‌కు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం విచారణకు హాజరుకావడానికి రమేష్ అరండల్‌పేట పోలీసు స్టేషన్‌కు వచ్చారు.
జోగి రమేష్‌తో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, కొలుసు పార్థసారథి, రావి వెంకటరమణ, కిలారి వెంకట రోశయ్య, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, కావటి మనోహర్‌నాయుడు, చంద్రగిరి ఏసురత్నం కూడా స్టేషన్‌కు వచ్చారు. అడిషనల్ ఎస్పీ వై.టి.నాయుడు, వెస్ట్ డీఎస్పీ సౌమ్యలతలను కలిసి కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం జోగి రమేష్‌ను మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో విచారణ కోసం ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లారు. జోగి రమేష్‌తో పాటు వైఎస్సార్‌సీపీ లీగల్ విభాగం గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి, న్యాయవాది పోకల వెంకటేశ్వర్లు ఉన్నారు. సుమారు ఐదు గంటల పాటు విచారించిన తర్వాత సాయంత్రం 5.40 గంటలకు రమేష్‌ను బయటకు పంపారు. ఈనెల 15న మరోసారి విచారణకు హాజరు కావాలని ఆయనను పోలీసులు ఆదేశించారు.
పోలీసుస్టేషన్ ఎదుట ఉద్రిక్తత
అరండల్‌పేట పోలీసు స్టేషన్ వద్దకు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో పోలీసులు పార్టీ కార్యకర్తలను నెట్టి వేయడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసుల వేధింపులకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అరండల్‌పేట పోలీసుస్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. జోగి రమేష్‌ను విచారిస్తున్న సమయంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మీడియాతో మాట్లాడుతుండగా అక్కడకు వచ్చిన అడిషనల్ ఎస్పీ వై.టి.నాయుడు దురుసుగా ప్రవర్తించారు. మీడియా ప్రతినిధులను చొక్కా పట్టుకుని పక్కకు నెట్టివేశారు. వారితో పాటు ఎమ్మెల్యే ముస్తఫాను సైతం నెట్టి వేయడంతో అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
భయపడేదిలేదు.. (బాక్స్)
వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టిస్తున్న సీఎం చంద్రబాబుకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పటంతో పాటు, రాష్ట్రంలోని నరకాసుర పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోగి రమేష్ అన్నారు. పోలీసుల విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి ఎందుకు స్పష్టంగా స్పందించటం లేదని చంద్రబాబును ప్రశ్నించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. నిందితుడికి సహకరించిన వారెవరో ఇప్పటికీ బయటపెట్టడంలేదన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన దానిని విలేకర్ల సమావేశంలో తాను చూపిస్తే.. తనపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయాలనుకుంటున్నారని తెలిపారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కేసులు పెట్టించినంత మాత్రాన భయపడేది లేదన్నారు.ð రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతానికి ముఖ్యమంత్రే కారణమన్నారు. ఏపీలో అరాచకాలు జరగబోతున్నాయని సినీనటుడు శివాజీ చెబితే.. రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. కైమాగా కొట్టిస్తామని ఎంపీ కేశినేని నాని, అనుకుంటే స్పాట్ పెడతామని మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యలు చేస్తే ఎందుకు కేసులు పెట్టరని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment