సాక్షి, అమరావతి : చంద్రబాబు ప్రభుత్వం తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిసారి రాజీపడేలా వ్యవహరించిందని తెలిపారు. విభజన హామీల విషయంలో ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటుచేయలేదని గుర్తుచేశారు. సోమవారం ఏపీ వామపక్ష నేతలు మధు, రామకృష్ణతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు నిధులే కొరత ఉన్నా.. ఏపీ సర్కారు ఇష్టరాజ్యంగా నిధులను ఖర్చుపెట్టిందని, అభివృద్ధి, ప్రజారోగ్యానికి ఉద్దేశించిన నిధులను పుష్కరాల కోసం ఖర్చు చేసిందని విమర్శించారు. టీడీపీ తీరుతో రాష్ట్రానికి తీరనినష్టం వాటిల్లిందని తెలిపారు. అమరావతి ఏపీ ప్రజలకు సంబంధించిన రాజధానిలా కనిపించడం లేదు.. టీడీపికి సంబంధించిన రాజధానిలా మారిందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం జనసేన, సీపీఐ, సీపీఎం కలిసి పనిచేస్తాయని పవన్ తెలిపారు.
కలిసి ఉద్యమాలు చేస్తాం
రాజధాని లేదు. పరిశ్రమలు లేవు. రైల్వే జోన్ లేదు. సీమ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీ లేదు. హోదా, విభజన హామీల సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించాలని సీపీఎం, సీపీఐ, జనసేన కలిసి నిర్ణయించాయి. మేధావులు, ఉద్యోగస్తులు, మధ్యతరగతి వారిని కలుపుకొని.. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల నుండి ఉద్యమాలు ప్రారంభిస్తాం. మోసం చేసిన బీజేపీ, వంతపాడిన టీడీపీని ఎండగడుతాం.
-సీపీఎం నేత మధు
బాబు కొత్త డ్రామాకు తెరతీశారు
ఐదు కోట్ల ప్రజలు అన్యాయం జరిగిందని అంటున్నా మోదీ ప్రభుత్వం స్పందించలేదు. నాలుగేళ్ళు లాలూచీ పడి ఇప్పుడు ఉద్యమం చేస్తున్నట్టు బాబు డ్రామా ఆడుతున్నారు. తన లోపాలను ఎండగడితే రాష్ట్రాన్ని అవమాన పరిచినట్టు చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారు. అనంతపురంలో ఏప్రిల్‌లో, తర్వాత విశాఖ, ప్రకాశంలో సమావేశాలు నిర్వహిస్తాం. రాష్ట్రాల్లో ఫిరాయింపు, అవినీతి రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రజలు మా వైపు చూసే విధంగా పోరాటం ఉంటది. 27న అంబేద్కర్ విగ్రహాల వద్ద మౌన దీక్షలు చేస్తాం.
-సీపీఐ నేత రామకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment