
అభిమాని నాగరాజు కుమారుడికి నామకరణం చేస్తున్న పవన్‌కళ్యాణ్
తుని: కుటుంబసభ్యులతో సంతోషంగా గడపాల్సిన నాగరాజు విద్యుత్ షాక్‌తో మృతి చెందడం దురదృష్టకరమైన సంఘటన, నన్ను ఎంతగానో కలిచి వేసిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కన్నీటి పర్యంతమయ్యారు. విశాఖజిల్లా పాయకరావుపేటలో పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా ఈనెల 5న ఫ్లెక్సీ కడుతున్న సమయంలో ఇద్దరు అభిమానులు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో పర్యటన రద్దు చేసుకున్న పవన్ కళ్యాణ్ శుక్రవారం బాధిత కుటుంబాలను పరామర్శించారు. తుని పట్టణం తారక రామానగర్‌కు చెందిన తోలెం నాగరాజు కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. చిన్న వయస్సులోనే పసుపు కుంకుమ కోల్పోయిన నాగరాజు భార్య సత్యను ఓదార్చారు.
ముగ్గురు పిల్లలను అక్కును చేర్చుకుని కన్నీరు పెట్టుకున్నారు. మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆరు నెలల బాలుడికి గౌరీ శంకర్‌గా నామకరణం చేశారు. భౌతికంగా నాగరాజు లేకపోయినా గౌరీ శంకర్‌లో చూసుకోవాలన్నారు. అభిమానులు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అందరినీ అప్యాయంగా పలకరించారు. నాగరాజు కుటుంబానికి రూ.మూడు లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పిల్లలకు మంచి చదువును చెప్పించాలని సత్యకు సూచించారు. పాకరావుపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు గెడ్డం బుజ్జి, తుని నియోజకవర్గం నాయకుడు చోడిశెట్టి గణేష్, పలువురు నాయకులు పాల్గొన్నారు. అనుకున్న షెడ్యూల్ కంటే రెండు గంటలు ఆలస్యమైనా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తుని గొల్ల అప్పారావుసెంటర్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులకు పవన్ కళ్యాణ్ అభివాదం చేశారు.