సాక్షి, అమరావతి: పూటకోమాట మార్చే పచ్చి మోసగాడు సీఎంగా ఉండటం రాష్ట్రానికి దురదృష్టకరమని, ఇంత డొంకతిరుగుడు అవకాశవాద రాజకీయ నాయకుడిని తానెప్పుడూ చూడలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాగా భయస్తుడైన చంద్రబాబు బీరాలు పలకడంలో సిద్ధహస్తుడన్నారు. రాజకీయ లబ్ధికోసం నీతి నియమాలు లేకుండా మాట్లాడే వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. సీఎం స్థాయిని మరిచి చాలా నీచంగా వ్యవహరించే చంద్రబాబు మాట్లాడేది చేయడని, చేసేది మాట్లాడడని విమర్శించారు. బీజేపీతో కాపురం చేసినప్పుడు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అని ప్రశ్నించిన చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టి హోదా కోసం పోరాడుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తొలినుంచీ పోరాడుతున్న వైఎస్సార్‌సీపీకి మైలేజీ వస్తుందనే భయంతో ఇప్పుడు చంద్రబాబు మాటమార్చి ప్రజాధనాన్ని దుబారా చేసి ధర్మపోరాట దీక్షలు నిర్వహిస్తున్నాడని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదని, రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సిందేనని అసెంబ్లీలోను, ప్రజాక్షేత్రంలోనూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గళమెత్తారని, ఏపీ విభజన తర్వాత కూడా 11 రాష్ట్రాలకు హోదాను కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారని, అయినా చంద్రబాబు చెవికెక్కలేదని ధ్వజమెత్తారు. ప్యాకేజీ కావాలని అడుగుతూ వచ్చిన బాబు ఇప్పుడు హోదాకోసం పోరాడుతునట్లు ప్రచారం చేసుకోవడం కంటే సిగ్గుమాలిన చర్య మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు.
అవకాశవాదానికి నిదర్శనం..
హైకోర్టు విభజనను త్వరగా చేయాలని రూ.66 లక్షల ప్రజాధనాన్ని ఫీజుగా చెల్లించి లాయర్‌ను పెట్టి సుప్రీంకోర్టులో కేసు వేయించిన చంద్రబాబు ఇప్పుడు మాటమార్చడం ఆయన అవకా>శవాదానికి అద్దం పడుతోందని పెద్దిరెడ్డి విమర్శించారు. ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిన చంద్రబాబు అది తన వాయిస్ కాదని, డబ్బులు పట్టుకెళ్లినవాళ్లు టీడీపీవారు కాదని ఎక్కడా ఖండించలేదని గుర్తు చేశారు. మీ సంగతి చూస్తామంటే మీ సంగతి తేలుస్తామంటూ కేసీఆర్, చంద్రబాబు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారే తప్ప కేసులపై కనీస చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే వారిమధ్య లాలూచీ ఉందనే అర్థమవుతోందని అనుమానం వెలిబుచ్చారు.
రేపు ఎవరితోనో..
అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరైన చంద్రబాబు మొన్నటివరకు బీజేపీతో పొత్తు కొనసాగించారని, ఇప్పుడు కాంగ్రెస్‌తో కాపురం పెట్టారని, రేపు ఎవరితో ఉంటారో తెలియదని ఎద్దేవా చేశారు. మోదీని పొగిడిన చంద్రబాబు ఇప్పుడు తిడుతున్నాడని, ఇటలీ దెయ్యం అన్న సోనియా ఇప్పుడు దేవత అయ్యిందని, పిల్లకుంకలా కన్పించిన రాహుల్‌కు జూనియర్‌గా మారిపోయాడన్నారు. నిన్నటివరకు మోదీతో మైత్రి కొనసాగించిన చంద్రబాబు ఇప్పుడు మోదీ, కేసీఆర్, జగన్ కలిసి పోటీ చేయాలంటూ వ్యాఖ్యానించడం దిగజారుడు రాజకీయానికి పరాకాష్ట అన్నారు. అవకాశవాద పొత్తులు పెట్టుకునే చంద్రబాబు తనకు అంటిన బురదను అందరికీ అంటించే ప్రయత్నం చేస్తు న్నాడన్నారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకునేది లేదని, ఒంట రిగానే పోటీ చేస్తామంటూ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటిం చారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో 130 నుంచి 140 సీట్లతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment