
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(వైఎస్సార్‌సీపీ)
విజయవాడ: కాంగ్రెస్‌తో ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పొత్తుపెట్టుకోవడం చూస్తే వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పెట్టిన కేసులు అన్నీ చంద్రబాబు కుట్రలో భాగమే అని అర్ధమవుతోందని వైఎస్సార్‌సీపీ అగ్రనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబుకి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఎన్నిరంగులైనా మార్చగల సమర్ధుడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని పాతరేయాలి, తరిమేయాలి అన్న చంద్రబాబు ఈ రోజు పొత్తుపెట్టుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు.
నోట్ల రద్దు నా వల్లే జరిగిందని అప్పుడు చెప్పి..మళ్లీ మాట మార్చారని వెల్లడించారు. కరవు నివారణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రెయిన్‌గన్స్‌తో లక్షల ఎకరాలు కాపాడామని చెబుతున్నారు..ఒక్క ఎకరమైనా సాగు జరిగిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు అంటున్నారు..అసెంబ్లీ దూషణలకు పరిమితం అవుతుంది..మేము ఎలా రావాలని ప్రశ్నించారు. ఫిరాయించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి..రేపే అసెంబ్లీకి వస్తామని తెలిపారు.
చంద్రబాబు నీచరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫిరాయింపులపై పుస్తకం రాశారు..మరి చంద్రబాబుకి ఎందుకు చెప్పరని సూటిగా అడిగారు. చంద్రబాబు చర్యలతో హరికృష్ణ, ఎన్టీఆర్‌ల ఆత్మ ఘోషిస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మానసిక జబ్బుతో బాధపడుతున్నారా అనే అనుమానం వ్యక్తం అవుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం అవడం ఖాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment