సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అడుగడుగునా ఘన స్వాగతాలు..సమస్యల వినతులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర సాగుతోంది. 15వ రోజు ప్రజాసంకల్ప యాత్ర జిల్లాలోని దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లో సాగింది. ఆదివారం 8 గంటల సమయంలో దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు శివారులో నుంచి కొనసాగిన యాత్ర కొద్దిసేపటికి కుంకుపాడు వద్ద అద్దంకి నియోజకవర్గంలోని ప్రవేశించింది. నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెంచు గరటయ్య, ఆయన కుమారుడు కృష్ణ చైతన్యలతో పాటు పార్టీ నేతలు కార్యకర్తలు, అభిమానులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పార్టీ జెండాలతో యువకులు ఆకర్షణగా నిలిచారు. జగన్‌ను కలిసేందుకు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు యువతతో పాటు మహిళలు ఆసక్తి చూపించారు. పలువురు ప్రజలు సమస్యలపై జగన్‌కు వినతి పత్రాలు సమర్పించారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చక మోసం చేసిందని వాపోయారు.
అర్హులకు రేషన్‌కార్డు, పింఛన్లు ఇవ్వటం లేదన్నారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వటం లేదని, డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధులు కూడా ఇవ్వలేదని జగన్‌కు ఫిర్యాదులు చేశారు. రైతులకు రుణమాఫీ అందలేదని, పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించలేదని పలువురు రైతులు జగన్ దృష్టికి తెచ్చారు. మీ అందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం వస్తూనే అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జనానికి భరోసానిచ్చారు. అద్దంకి నియోజకవర్గంలో తొలిరోజు యాత్ర కుంకుపాడు, శ్రీరామ్‌నగర్ కాలనీ, పార్వతీపురం మీదుగా మధ్యాహ్నానికి తిమ్మాయిపాలెం చేరుకుంది. భోజన విరామం అనంతరం అక్కడి నుంచి అద్దంకి వరకు కొనసాగింది. అనంతరం జగన్ అద్దంకి పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆశీర్వదిస్తే ప్రభుత్వం వచ్చిన వెంటనే నవరత్నాలతో పాటు పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తామని జగన్ జనానికి భరోసానిచ్చారు. 15వ రోజు వైఎస్ జగన్ 15.3 కి.మీ. మేర పాదయాత్ర సాగించారు.
జగన్‌తో కలిసి నడిచిన నేతలు:
15వ రోజు ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్‌తో పాటు పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్, అద్దంకి సమన్వయకర్త చెంచు గరటయ్య, వైఎస్సార్‌సీపీ నేతలు వై.వి.భద్రారెడ్డి జగన్‌తో కలిసి నడిచారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విభాగం వాణిజ్య విభాగం కుప్పం ప్రసాద్, జిల్లా నేతలు రామానాయుడు, ప్రసాద్, ఒంగోలు పట్టణ అధ్యక్షులు శింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment