వినతుల వెల్లువ | Peoples Saying their Problems to Young leader YS Jagan Mohan reddy | Sakshi
Sakshi News home page

వినతుల వెల్లువ

Published Mon, Mar 5 2018 8:28 AM | Last Updated on Wed, Jul 25 2018 5:35 PM

Peoples Saying their Problems to Young leader YS Jagan Mohan reddy - Sakshi

వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అద్దంకి నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో ఆయనకు సమస్యలు విన్నవించుకునేందుకు ప్రజలు అడుగడుగునా వేచి ఉన్నారు. రైతులు, విద్యార్థులు, వికలాంగులు, నిరుపేదలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తమ అభిమాన నేతకు కన్నీటి పర్యంతరమవుతూ విన్నవించారు. పార్టీ శ్రేణులు సైతం టీడీపీ నాయకుల నుంచి తామెదుర్కొంటున్న ఇబ్బందులు ఏకరువుపెట్టారు.


టీడీపీ ప్రభుత్వం వల్లే నిధులు రావడం లేదు
ఉలవపాడు: తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధికి ఆటంకంగా మారి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రానీయకుండా చేస్తుంది. అందుకే ప్రత్యేక హోదా, పరిశ్రమలు రావడంలేదని దొనకొండకు చెందిన బొమ్మిరెడ్డి బ్రహ్మారెడ్డి జగన్‌ను కలసి విన్నవించారు. ప్రకాశం జిల్లా వెనుకబడి ఉందని దొనకొండలో పరిశ్రమలు ఏర్పాటు అని చెప్పిమరలా పట్టించుకోవడం లేదని తెలిపారు. జిల్లా అభివృద్ధి జరిగేలా చూడాలని విన్నవించారు. – బ్రహ్మారెడ్డి

స్కాలర్‌షిప్‌ రాక ఆగిన చదువు
పీసీపల్లి: ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. స్కాలర్‌షిప్‌ల కోసం గత రెండు సంవత్సరాలుగా దరఖాస్తు చేస్తున్నాను. అయితే ప్రభుత్వం మంజూరు చేయలేదని అద్దంకికి చెందిన యు.ప్రతిభ  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందించింది. అప్పుచేసి ఎంబీబీఎస్‌ చదువుతున్నానని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ట్రజరీలో సమస్య ఉండడం వల్ల రావడంలేదని కాలేజీ యాజమాన్యం చెబుతుందని వాపోయింది.
– యు.ప్రతిభ

బాబు పాలన అంతమయ్యే రోజులొస్తున్నాయి...
ఉలవపాడు: చంద్రబాబు పాలన అంతమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సంతమాగులూరు మండలం మిన్నకల్లుకు చెందిన దివ్యాంగుడు కంభంపాటి వెంకటరావు, జగన్‌ను కలసి తెలియచేశారు. దివ్యాంగులు చంద్రబాబు పాలన అంటేనే భయపడుతున్నారని 2019లో మీరు ముఖ్యమంత్రి అయి మా సమస్యలు తీర్చాలని కోరారు.
– వెంకటరావు

పెద్దాయన జ్ఞాపకాలు మరువలేనివి
చీరాల అర్బన్‌: ముండ్లమూరుకు చెందిన బి.లక్ష్మణరావు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన సమయం నుంచి ఆయనకు సంబంధించిన పేపర్‌ కటింగ్స్, మరణానంతరం జరిగిన సంఘటన ఫొటోలతో కూడిన బుక్‌ను తయారు చేసి ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందించేందుకు వచ్చారు. పెద్దాయన జ్ఞాపకాలు మరచిపోలేమని వాపోయాడు. అలానే ప్రజాసంకల్పయాత్రకు సంబంధించి ఫొటోలతో కూడిన ప్రత్యేక బుక్‌ను కూడా తయారు చేస్తున్నట్లు తెలిపారు. 
– వైఎస్‌ రాజశేఖరరెడ్డికి సంబంధించిన ఫొటోలతో కూడిన బుక్‌

రైతులను మోసం చేస్తున్నారయ్యా...
ఉలవపాడు: కంది రైతులు ఈ ప్రభుత్వంలో దారుణంగా మోస పోతున్నారని కుంకుపాడుకు చెందిన గూడా అంజిరెడ్డి, జగన్‌ను కలసి విన్నవించాడు. తనపొలంలో కంది పంట వేశానని ఎకరాకు రెండు క్వింటాళ్లు పండితే తేమ 12 శాతం లేదని తీసుకోవడం లేదని అదే దళారులు తీసుకెళితే మాత్రం తీసుకుంటున్నారని తెలిపారు. తమ గ్రామంలో ఫ్లోరిన్‌ ప్రభావం వల్ల గత పదేళ్ల కాలంలో 40 ఏండ్ల లోపు వారు 30 మంది పైగా చనిపోయారని తెలిపారు. 14 కి.మీలో గుండ్లకమ్మ జలాశయం ఉన్నా నీరు అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని తమ సమస్యలు వివరించారు.
– అంజిరెడ్డి, రైతు

జగన్‌ను చూడడానికి వచ్చాం...
ఉలవపాడు: పాదయాత్రలో ఉన్న జగన్‌ ఎలా ఉన్నాడా అని చూడడానికి పులివెందుల నుంచి వీరయ్య, ఎల్లమ్మ దంపతులు వచ్చి జగన్‌ ను కలిశారు. కేవలం జగన్‌ ఎలా ఉన్నాడని చూడడానికే ఇప్పటికి నాలుగు సార్లు ప్రజా సంకల్పయాత్రకు వచ్చినట్లు తెలిపారు.
– వీరయ్య, ఎల్లమ్మ దంపతులు

గుండ్లకమ్మ నదిపై చెక్‌డ్యాం నిర్మించాలి
చీరాల అర్బన్‌: గుండ్లకమ్మనదిపై చెక్‌డ్యాం నిర్మించాలని అద్దంకి మండలం తిమ్మాయిపాలెం, రామాయిపాలెం గ్రామస్తులు పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి అర్జీ ఇచ్చేందుకు వచ్చారు. చెక్‌డ్యాం నిర్మించడం వల్ల çసుమారు 1200 ఎకరాలకు నీరందుతుందని రైతులు తెలిపారు. దీని ద్వారా ఆ ప్రాంత భూగర్భజలాలు పెరిగి పంటలు పండుతాయని, తాగు, సాగునీరుకు ఇబ్బందులు తీరుతాయని తెలిపారు.
– వినతిపత్రం అందించేందుకు వచ్చిన రైతు

మా అమ్మ పింఛన్‌ తొలగించారయ్యా..
ఉలవపాడు: మా అమ్మ పింఛన్‌ను అన్యాయంగా తొలగించారని యల్‌.బాలకృష్ణ జగన్‌కు తమ సమస్యను తెలియచేయడానికి వచ్చారు. తాళ్లూరు మండలంలో రమణాలవారిపాలెంనకు చెందిన సుబ్బులుకు వైఎస్సార్‌ సమయంలో íపింఛన్‌ వచ్చేది. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పింఛన్‌ను తొలగించారు.
– బాలకృష్ణ

మా కుటుంబానికి దిక్కెవరు...
ఒంగోలు వన్‌టౌన్‌: తాళ్ళూరుకు చెందిన దివ్యాంగుడు కోలా ఆనందరావుకు భార్య, నలుగురు పిల్లలున్నారు. ఆనందరావు భార్య అంజమ్మ రోజు వారీ కూలికి వెళ్ళి రూ. 200 సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తుందని, వికలాంగుడినైన నాకు, నా కుటుంబానికి ప్రభుత్వపరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందటం లేదంటూ పాదయాత్రలో వైఎస్‌ జగన్‌హన్‌రెడ్డిని కలవటానికి వచ్చారు.
– కోలా ఆనందరావు, దివ్యాంగుడు

టీడీపీ నేతలు వేధిస్తున్నారు
ఒంగోలు వన్‌టౌన్‌: జె.పంగులూరు మండలం రాంకూరు గ్రామానికి చెందిన ఆసోదా బంగారుబాబు మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో పని చేశాడు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఏర్పడినప్పటి నుంచి కార్యకర్తగా పని చేస్తున్న బంగారుబాబుపై కక్ష్య కట్టిన స్థానిక టీడీపీ నాయకులు నాలుగు సంవత్సరాల క్రితం ఇంటిని తగులబెట్టారని ఇప్పటికీ తనను వేధిస్తున్నారంటూ పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించటానికి వచ్చాడు.
– ఆసోదా బంగారుబాబు

బీమా సొమ్మును సంక్షేమ నిధికి జమ చేయాలి
పర్చూరు: చంద్రన్న బీమాకు వాడిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంక్షేమ నిధికి జమ చేయాలని అద్దంకి తాపీమేస్త్రీల సంఘం ప్రెసిడెంట్‌ పి.వెంకట్రావు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద మొర పెట్టుకున్నాడు. సభ్యులు దురదృష్టవశాత్తు మరణించిన వయస్సుతో సంబంధం లేకుండా రూ. 5 లక్షలివ్వాలని కోరారు. విదేశీ చదువులకు స్కాలర్‌షిప్‌లు, సంక్షేమ నిధి నుంచి మంజూరు చేయాలని కోరారు.
– పి.వెంకట్రావు, అద్దంకి తాపీమేస్త్రీల సంఘం ప్రెసిడెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement