సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఆప్, అమిత్ షా నాయకత్వంలో బీజేపీ ప్రధానంగా పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఢిల్లీ ప్రజలు మళ్లీ ఆప్‌కే పట్టం కట్టారు. విద్యుత్, మంచినీటి సరఫరా, విద్యా, ఆరోగ్యం, ప్రజా రవాణా, ఢిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సదుపాయం తదితర తాము చేపట్టిన స్థానిక అభివృద్ధి కార్యక్రమాల ప్రాతిపదికన ఆప్ నేత కేజ్రివాల్, ఇతర నేతలు ఎన్నికల ప్రచారం చేయగా, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ లాంటి వివాదాస్పద జాతీయ అంశాల ప్రాతిపదికన అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు ప్రచారం చేశారు.
‘మోదీ– షహీన్‌బాద్’లో ఎవరు కావాలంటూ అమిత్‌షా జనవరి 23వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఢిల్లీలో తీవ్రతరం చేశారు. ముఖ్యంగా ముస్లిం మహిళల నాయకత్వాన సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా గత డిసెంబర్ 15వ తేదీ నుంచి ఢిల్లీలోని షహీన్‌బాద్‌లో ఆందోళన కొనసాగింది. షహీన్‌బాద్ ఆందోళనకు ఆసరాగా తీసుకొని ఎన్నికల్లో ఢిల్లీ వాసులను ప్రభావితం చేసేందుకు బీజేపీ నాయకులు తెగ ప్రచారం చేశారు. ఈ ప్రచారం గత రెండు వారాల్లో తీవ్రస్థాయికి చేరుకోవడంతో బీజేపీ బలపడుతోందని, ఆప్ బలహీన పడుతోందని వార్తలు వచ్చినా ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆప్‌కే బంపర్ మెజార్టీ వస్తుందని తేల్చి చెప్పింది.
ఢిల్లీవాసుల నాడి పట్టుకునేందుకు డాక్టర్ సజ్జన్ కుమార్, డాక్టర్ రాజన్ పాండే, డాక్టర్ బిజేంద్ర ఝా ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్‌లోని ప్రముఖ ఎన్నికల పరిశోధన సంస్థ ‘పీపుల్స్ పల్స్’ రంగంలోకి దిగింది. జనవరి 17 నుంచి జనవరి 29 వరకు నిర్వహించిన ఫీల్డ్ సర్వే కూడా ఆప్ విజయాన్నే సూచించాయి. అందుకు అయిదు కారణాలను కూడా ‘పీపుల్స్ పల్స్’ సూచించింది.
మొదటి అంశం: గత రెండున్నర దశాబ్దాలుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను స్థానిక అంశాలే ప్రభావితం చేస్తున్నాయి. 1998లో ఉల్లిగడ్డ ధరలు పెరిగిన కారణంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పడిపోయింది. అప్పుడు షీలాదీక్షిత్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2013 వరకు, 15 ఏళ్లపాటు అధికారంలో కొనసాగింది. అందుకు కారణం పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేయడం, నగరంలో వంతెనలు, మెట్రో లాంటి మౌలిక సౌకర్యాలను మెరగుపర్చడం, కాలుష్యం నివారణకు సీఎన్‌జీ బస్సులను ప్రవేశపెట్టడం. ఆ తర్వాత అవినీతి నిర్మూలన, స్థానిక అభివృద్ధి అంశాల ప్రాతిపదికనే ఆప్ గెలుస్తూ వచ్చింది. అంటే ఈ సారి కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాలే ప్రధానంగా ప్రభావం చేశాయని చెప్పడం మొదటి అంశం.
ఇక రెండో అంశం: గడచిన ఒకటిన్నర దశాబ్దం కాలంగా లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక మున్సిపాలిటీ ఎన్నికలను భిన్నమైన ఓటింగ్ సరళి కనిపిస్తోంది. ఢిల్లీకి మున్సిపాలిటీలకు 2007లో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ, అప్పటి నుంచి స్థానిక ఎన్నికల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీ పరిధిలోని ఏడుకు ఏడు లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకొంది. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మూడవ స్థానానికి పడిపోయింది. ఢిల్లీ ఓటరు నాడి ఒక్కో ఎన్నికలకు ఒక్కోరకంగా ఉన్నట్లు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. అంటే లోక్‌సభ ఎన్నికలను జాతీయ అంశాలు, అసెంబ్లీ ఎన్నికలను ప్రాంతీయ, స్థానిక అంశాలు ప్రభావితం చేసినట్లు స్పష్టం అవుతుంది.
మూడవ అంశం: ఢిల్లీ నైసర్గిక పరిస్థితులు, సామాజిక వెనకబాటుతనం, వలసలు అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. నగరంలో 76 శాతం జనాభా అనియత కాలనీల్లోనే. అంటే అనధికార కాలనీలు, మురికి వాడల్లో నివసిస్తున్నారు. వారిలో 50 శాతం మంది పేదలు, దిగువ మధ్య తరగతికి చెందిన వారే. వారికి నిత్య జీవితంలో విద్యుత్, మంచినీరు, విద్య, ఆరోగ్యం, ప్రభుత్వ రవాణా సదుపాయలపైనే ఆధారపడతారు. అందుకని వారంతా ఆ దృక్కోణం నుంచే ఎన్నికల్లో ఓటేస్తారు. (చదవండి: కేజ్రీవాల్‌ను తీవ్రవాది అన్న కేంద్రమంత్రి)
నాలుగవ అంశం: గత రెండు దశాబ్దాలుగా ఢిల్లీలో బీజేపీకి పంజాబీలు, కోమట్లు, జాట్‌ల నుంచే మద్దతు. పూర్వాంచల్ నుంచి వలసవచ్చిన వారితోపాటు దిగువ మధ్య తరగతి, మురికివాడల ప్రజలు, ముస్లింల మద్దతుతో 2013 వరకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. ఓ సామాజిక విప్లవంతో అధికారంలోకి వచ్చిన ఆప్, ఈ వర్గాల ప్రజలను ఆకర్షించడంతోపాటు బీజేపీకి చెందిన నమ్మకమైన ఓటర్లను కూడా తనవైపు తిప్పుకోగలిగింది. ‘మోదీ దేశానికి కావాల్సిన నాయకుడు, కేజ్రివాల్ ఢిల్లీకి కావాల్సిన నాయకుడు’ అనే నమ్మే బీజేపీ వర్గం కేజ్రివాల్‌కు మద్దతిస్తోంది. (చదవండి: బీజేపీ ఇంత దిగజారిపోయిందా?)
Comments
Please login to add a commentAdd a comment