పిల్లి సుభాష్, ఉమ్మారెడ్డి
సాక్షి, అమరావతి: మూడు రాజధానులకు సంబంధించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లుతోపాటు సీఆర్‌డీఏ రద్దు బిల్లు కూడా తమ దృష్టిలో శాసనమండలిలో ఆమోదం పొందినట్లేనని మండలిలో అధికార పక్ష నాయకుడు, ఉప ముఖ్యమంత్రి పిల్లిసుభాష్ చంద్రబోస్, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ‘14 రోజులు గడిచాయి. సెలక్ట్ కమిటీల ఏర్పాటు పూర్తి కాలేదు. ఇక దానికి చెల్లు చీటి పడినట్లే’నని సుభాష్ చంద్రబోస్ చెప్పారు. శాసనసభలో ఆమోదం పొందిన బిల్లులను ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష సభ్యులకు ఆమోదించడం, తిరస్కరించడం లేదంటే పరిశీలన పేరుతో సెలెక్ట్ కమిటీకి పంపడం లాంటి మూడు ప్రత్యామ్నాయాలే ఉంటాయని సుభాష్‌చంద్రబోస్ చెప్పారు. ‘ఈనెల 22న బిల్లులను మండలిలో ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకు జరిగిన పరిణామాల ఆధారంగా నిబంధనల ప్రకారం ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపే పరిస్థితి లేదు, బిల్లులను మండలి తిరస్కరించలేదు. ఈ నేపధ్యంలో మండలిలో బిల్లులు ఆమోదం పొందినట్టే’ అని పేర్కొన్నారు. శాసనసభలో, మండలిలోనూ ఆమోదం పొందిన ఈ బిల్లులను తదుపరి చర్యగా గవర్నర్‌కు పంపే విషయాన్ని అసెంబ్లీ అధికారులు చూసుకుంటారని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.
నిబంధనలను పాటించలేదు..
‘సెలెక్ట్ కమిటీ నియామకంపై ఏ ఒక్క నిబంధనను మండలి చైర్మన్ అనుసరించలేదు. 5(9) (5) నిబంధన ప్రకారం ఏదైనా బిల్లు మండలిలో ప్రవేశపెట్టే సమయంలోనే సెలెక్ట్ కమిటీకి పంపాలని అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఈ రెండు బిల్లుల విషయంలో అది జరగలేదు. మండలి చైర్మన్ నిర్ణయం వెలువరించే సమయంలోనూ తప్పులు జరిగాయని ఒప్పుకున్నారు. అలాంటప్పుడు చైర్మన్ విచక్షణాధికారంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు’ అని చెప్పారు. అసెంబ్లీ కార్యదర్శి తమతో భేటీకి ముందే సెలక్ట్ కమిటీ అంశానికి సంబంధించిన ఫైల్‌ను తిప్పి పంపారని ఉమ్మారెడ్డి, సుభాష్ చంద్రబోస్ తెలిపారు. గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం, సస్పెండ్ చేస్తామంటూ అసెంబ్లీ కార్యదర్శిని టీడీపీ నేతలే బెదిరిస్తున్నారని చెప్పారు.
ఆరు దశల ప్రక్రియ జరగలేదు...
బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా మండలి చైర్మన్ దీనిపై మరో ఆరు దశలలో తదుపరి ప్రక్రియ చేపట్టాలని నిబంధనలు పేర్కొంటున్నాయని సుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి తెలిపారు.
– మొదటి దశగా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని తాను తీసుకున్న నిర్ణయం
ఆమోదయోగ్యమేనా? అని చైర్మన్ సభను అడిగి తెలుసుకోవాల్సి ఉంది.
–రెండోదశగా మూజువాణి ఓటుతోనైనా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయంపై సభ అభిప్రాయం తెలుసుకోవాలి.
– అలాంటి సమయంలో ఆ నిర్ణయంపై ఎవరైనా ఓటింగ్ కోరితే నిర్వహించాలి.
–సెలెక్ట్ కమిటీకి పంపాలని సభలో నిర్ణయం జరిగితే సభ్యుల సంఖ్య ఆధారంగా ఎంతమందితో ఏర్పాటు చేస్తున్నారనే అంశాన్ని సభలోనే వెల్లడించాలి.
– ఒకవేళ 8 మంది సభ్యులతో సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటే పార్టీల వారీగా ఎంతమందితో ఏర్పాటు చేస్తున్నారో ప్రకటించాలి.
– సభలో వివిధ పార్టీల సభాపక్ష నాయకుల నుంచి ఆయా కమిటీలకు ప్రతిపాదించే సభ్యుల పేర్లను సేకరించాలి. ఆ తరువాత సంబంధిత సభ్యుల నుంచి అంగీకారం తీసుకోవాలి.
– మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేసే అంశంలో ఇవేమి చేయలేదు.
–సెలక్ట్ కమిటీల ఏర్పాటు, సభ్యుల పేర్లను మీడియా ద్వారా ప్రకటించడం సభా హక్కుల ఉల్లంఘనే.
– విచక్షణాధికారం ఉందని మండలి చైర్మన్ ఒకరికి ఉరి వేయమని ప్రకటించి అమలు చేయమంటే అధికారులు పాటించాలా?
Comments
Please login to add a commentAdd a comment