న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. సోషల్ మీడియా వేదికగా ‘మై భీ చౌకీదార్’ పేరిట ప్రచారాన్ని ఉధృతం చేసింది. దీనిలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం తన ట్విట్టర్ ఖాతాలో పేరును ‘చౌకీదార్ నరేంద్ర మోదీ’గా మార్చారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు తమ ట్విట్టర్ ఖాతాల పేర్లకు ‘చౌకీదార్’పదాన్ని జతచేర్చారు. ‘నేను కాపాలాదారుడినే (చౌకీదార్). కాపాలాదారుగా దేశానికి సేవ చేయాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నాను. కానీ నేను ఒంటరిని కాదు. అవినీతి, సామాజిక దుశ్చర్యలు వంటి వాటిపై పోరాడే ప్రతి ఒక్కరూ చౌకీదార్‌లే. దేశాభివృద్ధి, పురోగతి కోసం కృషి చేసే ప్రతీ భారతీయుడు ‘మై భీ చౌకీదార్’అని అంటున్నారు’అని ప్రధాని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా ట్విట్టర్‌లో స్పందించారు. ‘దేశానికి కాపాలాదారుల్లా వ్యవహరిస్తున్న మేం నగదు రహిత ఆర్థిక లావాదేవీల ద్వారా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తామని హామీ ఇస్తున్నాం. దశాబ్దాలుగా పేరుకుపోయిన నల్లధనం, అవినీతి వల్ల ప్రతికూల ప్రభావం ఎదురైంది. మెరుగైన భవిష్యత్ కోసం వీటిని తొలగించాల్సిన అవసరముంది’అని పేర్కొన్నారు. అయితే, బీజేపీ ప్రారంభించిన నేనూ కాపలాదారునే అనే ప్రచారానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూడా ‘కాపలాదారుడే దొంగ’ప్రచారాన్ని ప్రారంభించింది. కాగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దాదాపు 100 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ బహిరంగ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారని బీజేపీ ఆదివారం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment