
రాయ్‌చూర్: వెర్రి వేయి విధాలన్న మాటను బసవరాజ్ ఒప్పుకునే స్థితిలో లేడు! ఎన్నికల క్షేత్రం కర్ణాటకలో బీజేపీని గెలిపించాల్సిన భారం ఆయనదే మరి!! అతనికి బాధ్యతలు అప్పజెప్పింది మరెవరోకాదు.. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీనే!!! గడిచిన కొద్ది గంటలుగా సాధారణ మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ హల్‌చల్ చేస్తోన్న ఈ ఫొటో వివరాల్లోకి వెళితే..
రాయ్‌చూర్‌కు చెందిన బసవరాజ్ బీజేపీ కార్యకర్త. అంతకుమించి నరేంద్ర మోదీకి భక్తుడు. అతని వీరాభిమానం ఏ స్థాయిలో ఉందంటే.. ఏకంగా వీపుపై అతిపెద్ద మోదీ టాటూ వేయించుకున్నాడు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో బసవడు ఓ హాట్‌టాపిక్‌గా మారాడు. ఎన్నికల ప్రచారం కోసం ఆదివారం రాయ్‌చూర్‌కు వచ్చిన మోదీ.. ఈ వీరాభిమాని గురించి ఆరాతీశారు. ప్రసంగంలో అతని పేరును ప్రస్తావిస్తూ.. ‘‘బసవరాజ్.. బీజేపీని గెలిపించాలి మరి..’’ అని అన్నారు. అంతే! అవధుల్లేని ఆనందంతో పొంగిపోయాడా అభిమాని!
15 గంటలు పట్టింది: ‘‘మోదీగారంటే నాకు చాలా ఇష్టం. గడిచిన నాలుగేళ్లలో ఆయన దేశాన్ని బాగా అభివృద్ధిచేశారు. ఆ అభిమానంతోనే టాటూ వేయించుకున్నా. ఇందుకోసం కదలకుండా 15 గంటలు కూర్చోవాల్సి వచ్చింది. అదేమంత కష్టంకాదుగానీ, మోదీ నోటి వెంట నా పేరు వినిపించడం మహదానందం. ఆయన చెప్పినట్లే బీజేపీ గెలుపు కోసం కష్టపడతా..’ అని మీడియాతో చెప్పాడు బసవరాజ్. రాయ్‌చూర్‌లో ట్యూటర్‌గా పనిచేస్తున్నాడతను. కాగా, మనోడి టాటూ వ్యవహారంపై భిన్నస్పందనలు వస్తున్నాయి. బసవరాజ్ అభిమానాన్ని వెర్రితనని కొందరంటే.. ఇందులో తప్పేమీ లేదని ఇంకొందరు వాదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment