భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : ఏ అంశం గురించి మాట్లాడాల్సి వచ్చినా ప్రజలను ఆకర్షించడం కోసం అక్రోనిమ్స్.... అంటే వివిధ పదాల తొలి అక్షరాలతో కూడిన సంక్షిప్త నామాలను ఉపయోగించడం మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అలవాటు. అందులో భాగంగానే ఆయన జన్‌ధన్, ఆధార్, మొబైల్‌లను కలిపి జామ్ అని, రాహుల్ గాంధీ, సోనియా, వాద్రా, ప్రియాంక కుటుంబాన్ని కలిపి ఆర్‌ఎస్‌వీపీ అని ఇండియన్ టెక్నాలజీ, ఇండియన్ టాలెంట్ కలిస్తే టుమారో ఇండియా అవుతుందని చెప్పడానికి ఐటీ ప్లస్ ఐటీ ప్లస్ ఐటీ అంటూ ఎన్నో ఆక్రోనిమ్స్ చెప్పారు.
బెంగుళూరులో ఆదివారం భారతీయ జనతా పార్టీ నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ మరో కొత్త సంక్తిప్త నామంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోయిన రైతులను ఆదుకోవడమే తన ‘టాప్’ ప్రియారిటీ అని, టాప్ అంటే టమాటో, ఆనియన్, పొటాటో అని వివరణ ఇచ్చారు. దీనిపై ట్విట్టరాటీలు కూడా తమదైన శైలిలో సంక్షిప్త నామాలను ప్రయోగించి సరదా తీర్చుకున్నారు.
నరేంద్ర మోదీ ‘స్యాడ్’ అంటే సీరియస్ ఆక్రోనిమ్ డిసార్డర్ అనే జబ్బుతో బాధపడుతున్నారని ఒకరు వ్యాఖ్యానించగా, ‘టాప్’ను కాదంటే టాప్ లేచిపోతుందని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకానయం రైతులనుద్దేశించి వారే తన ‘టాప్‌లెస్’ ప్రియారిటీ అని మోదీ చెప్పలేదు, అంటే టమాటో, ఆనియన్, పొటాటో, లేడీస్ ఫింగర్, ఎగ్‌ఫ్లాంట్, స్పినాష్, సోయాబీన్స్ అని అనలేదని ఇంకొకరు వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ ప్రోత్సహంతో రెచ్చిపోతున్న టెర్రరిజాన్ని ఎదుర్కోవడంలో, దేశంలోని నిరుద్యోగ సమస్యను అరికట్టడంలో, రైతుల ఆత్మహత్యలను నివారించడంలో, మహిళలపై జరుగుతున్న దారుణాలను దూరం చేయడంలో, ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో నరేంద్ర మోదీ ఎందుకు విఫలం అవుతున్నారో తనకు ఇప్పుడర్థమయిందని, ఆయన ‘టాప్ ప్రియారిటీ’ టమాటో, ఆనియన్, పొటాటో కావడమేనని ఓ క్రిటిక్ వ్యాఖ్యానించారు.
వీధుల్లో పకోడి అమ్ముకునేవారిని కూడా ఉపాధి పొందుతున్న వారి కిందే లెక్కేయాలని ఇటీవల మోదీ చేసిన ఓ వ్యాఖ్యను ప్రస్తావిస్తూ టాప్ కలిపిన పకోడి మరీ పసందుగా ఉంటుందని మరొకరు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment