సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
‘సోదరా సోదరీ మణులారా.. హైదరాబాద్‌కు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ అంటే సర్ధార్ వల్లభాయ్ పటేల్ గుర్తుకు వస్తారు. నిజాం సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన పటేల్‌కు వీరభూమి నుంచి ప్రణమిల్లుతున్నాను. తెలంగాణ విమోచనంలో అమరులైన వీరులకు జోహార్లు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నా అభినందనలు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంద’ని మోదీ తెలుగులో ప్రసంగించారు. తర్వాత హిందీలో ప్రసంగాన్ని కొనసాగించారు. అభివృద్ధి విషయంలో ఎవరిపట్ల వివక్ష చూపబోమని, సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. నేడు ప్రపంచం దృష్టిని హైదరాబాద్ ఆకర్షించిందన్నారు. భారతమాత సేవకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని, ఈ ఘనత కార్యకర్తలకే దక్కుతుందన్నారు. ‘జై మోదీ’ నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. అంతకుముందు మోదీకి పుస్తకాలు బహుకరించి, శాలువాలు కప్పి బీజేపీ నేతలు సన్మానించారు.
ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రులు, బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment