
సాక్షి, న్యూఢిల్లీ: రైతు సమస్యలపై చలో అసెంబ్లీ ర్యాలీని చేపట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలను, రైతు సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోవడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా ఖండించారు. ప్రజా స్వామ్యబద్ధంగా రాష్ట్రంలోని రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చేపట్టిన ర్యాలీని అనుమతి లేదన్న కారణంతో అడ్డుకోవడం తగదన్నారు.
కాంగ్రెస్ నేతలపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ రైతు సమస్యలపై కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీని ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన ఆనందం ప్రజల్లో లేదని, దానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని విమర్శించారు.