సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో తెలంగాణ అంతటా ప్రలోభాల పర్వానికి తెరలేచింది. పోలింగ్ తేదీ ముంచుకొస్తుండటంతో అభ్యర్థులు ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రలోభాల వల విసురుతున్నారు. ఎప్పటిలాగే డబ్బు పంపిణీ, మద్యం పంపిణీతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం, పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుండటం.. ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తుండటంతో పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పట్టుబడుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో పట్టుబడిన నగదు రూపాయలు వంద కోట్లను దాటడం గమనార్హం. ఇప్పటివరకు చేపట్టిన తనిఖీల్లో పట్టుబడిన నగదు రూ. 100 కోట్లు దాటిందని, ఇందులో పోలీసుశాఖ తనిఖీల్లో రూ. 75 కోట్లు పట్టుబడగా.. ఐటీ తనిఖీల్లో రూ. 25 పట్టుబడ్డాయి. రూ. తొమ్మిది కోట్ల విలువచేసే మద్యాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పోలింగ్ నాడు భారీ భద్రత
రాష్ట్రంలో శుక్రవారం జరిగే అసెంబ్లీ ఎన్నికలకు లక్షమందికిపైగా పోలీసులు విధులు నిర్వర్తించనున్నారు. ఇందులో రాష్ట్ర పోలీసులు 50వేలమంది కాగా, కేంద్ర బలగాలు 25వేల మంది, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి 50 వేలమంది పోలీసులు రానున్నారు. మొత్తం 32,724 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం ఈసారి ప్రత్యేక సీసీటీవీ కెమెరాలు అమర్చనుంది. ఈ కెమెరాల ద్వారా పోలింగ్ కేంద్రంలోపలి పరిస్థితిని ఈసీ పర్యవేక్షించనుండగా.. పోలింగ్ కేంద్రం బయట పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment