స్ట్రాంగ్ రూం వద్ద సాయుధ బలగాల బందోబస్తు
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల్లో తుది ఘట్టమైన కౌంటింగ్‌కు మూడు రోజుల గడువు ఉండటంతో పోలీసు బందోబస్తు డ్యూటీ స్ట్రాంగ్ రూమ్స్ వద్దకు మారింది. ఈవీఎం మిషన్లను శుక్రవారం రాత్రికి వీటికి తీసుకువచ్చి భద్రపరిచారు. నగర పరిధిలోని తొమ్మిది ప్రాంతాల్లోని 15 చోట్ల స్ట్రాంగ్ రూమ్స్/కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. మంగళవారం కౌంటింగ్ సైతం ఇక్కడే జరుగనుంది. పోలింగ్ నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకున్న పోలీసులు స్ట్రాంగ్‌రూమ్స్ వద్దా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా మూడంచెల భద్రత కల్పించడంతో పాటు కొన్ని అదనపు చర్యలు తీసుకుంటున్నారు.
ఈవీఎంల భద్రతా ఏర్పాట్లిలా...
స్ట్రాంగ్ రూమ్‌లకు కేవలం ఒకే ద్వారం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రూమ్‌కు డబుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేసి ఒకటి దాని ఇన్‌చార్జ్ వద్ద, మరోటి మెజిస్టీరియల్ అధికారాలున్న అధికారి వద్ద ఉంచారు.
♦ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 24 గంటలూ సాయుధ గార్డులను ఉంచడంతో పాటు అనునిత్యం సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. వీటి పక్కనే నిర్విరామంగా పని చేసే కంట్రోల్ రూమ్ నెలకొల్పి ఇందులో పోలీసులతో పాటు రెవెన్యూ అధికారినీ ఉంచారు. పవర్ కట్ లేకుండా చూస్తూనే... అదనంగా జనరేటర్ ఏర్పాటు చేశారు.
♦ మూడంచెల భద్రతలో భాగంగా తొలి అంచెలో (రూమ్ డోర్ దగ్గర) కేంద్ర సాయుధ బలగాలకు చెందిన వారు ఉంటున్నారు. దీనికోసం కనీసం ఒక సెక్షన్ (13 మంది) బలగాలు 24 గంటలూ అందుబాటులో ఉండేందుకు ఓ ప్లటూన్ (39 మంది) ప్రత్యేకంగా కేటాయించారు.
♦ రెండో అంచెలో రాష్ట్ర సాయుధ పోలీసులు, మూడో అంచెలో సాధారణ పోలీసు సాయుధ బలగాలను మోహరించారు.
♦ స్ట్రాంగ్‌రూమ్స్ ప్రాంగణంలోనే రూమ్ ప్రవేశ ద్వారం కనిపించేలా ఏర్పాటు చేసిన టెంట్స్‌లో అభ్యర్థుల ప్రతినిధులకు సౌకర్యం కల్పించారు. ఇలా అవకాశం లేని చోట సీసీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూమ్ ప్రవేశ ద్వారాన్ని టెంట్‌లో ఉండి చూసేలా, అప్పుడప్పుడు రూమ్స్ సమీపంలోకి స్వయంగా వెళ్లి పర్యవేక్షించే అవకాశం కల్పిస్తున్నారు.
♦ స్ట్రాంగ్‌రూమ్ ఉన్న ప్రాంగణం మొత్తాన్ని భద్ర తా వలయంగా పరిగణిస్తున్న పోలీసు అధికారులు అందులోకి పోలీసు ఉన్నతాధికారుల సహా ఎవరి వాహనాలను అనుమతించట్లేదు.
♦ రెండో అంచె భద్రతా వలయాన్ని దాటి ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ సమీపంలోని వెళ్లే ప్రతి ఒక్కరి వివరాలు కచ్చితంగా కేంద్ర సాయుధ బలగాల వద్ద లాగ్‌బుక్‌లో ఎంట్రీ చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియనూ వీడియోగ్రఫీ చేస్తున్నారు.
♦ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు స్థానిక పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ప్రతి రోజూ స్ట్రాంగ్‌రూమ్స్‌ను పరిశీలించి ప్రధాన ఎన్నికల అధికారికి నివేదిక ఇచ్చేలా ఏర్పాటు చేశారు. ఈ అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులూ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించనున్నారు.
♦ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బషీర్‌బాగ్ కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)కి అనుసంధానించారు. అక్కడి దృశ్యాలను ఎప్పటికప్పుడు ఇక్కడి సిబ్బంది పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు.
నియోజకవర్గం స్ట్రాంగ్‌రూమ్/కౌంటింగ్ కేంద్రం
ముషీరాబాద్ ఎల్బీ స్టేడియం బ్యాడ్మింటన్ హాల్
మలక్‌పేట అంబర్‌పేట ఇండోర్ స్టేడియం
సనత్‌నగర్ ఎంబీఏ కామర్స్ బిల్డింగ్, ఓయూ
సికింద్రాబాద్ పీజీఆర్‌ఆర్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓయూ
కార్వాన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, మాసబ్‌ట్యాంక్
యాకత్‌పుర వనిత మహా విద్యాలయ, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్
చార్మినార్ కమల నెహ్రూ పాలిటెక్నిక్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్
ఖైరతాబాద్ కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, నార్త్ వింగ్, యూసుఫ్‌గూడ
జూబ్లీహిల్స్ కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, సౌత్ వింగ్, యూసుఫ్‌గూడ
చంద్రాయణగుట్ట లైబ్రరీ హాల్, నిజాం కాలేజ్
నాంపల్లి బాక్సింగ్ హాల్, ఎల్బీ స్టేడియం
అంబర్‌పేట రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వైఎంసీఏ
బహదూర్‌పుర సాంకేతిక విద్యాభవన్, మాసబ్‌ట్యాంక్
గోషామహల్ కోఠి ఉమెన్స్ కాలేజ్ ఆడిటోరియం
కంటోన్మెంట్ వెస్లీ కాలేజ్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment