సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అందరు అభ్యర్థులూ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో నేరచరితులు, సమస్యాత్మక వ్యక్తులు రెచ్చిపోయే ప్రమాదం ఉందని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. వీరి కుయుక్తులకు చెక్ చెప్పేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ తరహా అభ్యర్థులు, అనుచరులను నిత్యం వెంటాడేందుకు ప్రత్యేక టీమ్స్‌ను రంగంలోకి దింపారు. ‘షాడో పార్టీలు’గా పిలిచే ఈ పోలీసులు సమస్యాత్మకమైన అభ్యర్థులు, వారి అనుచరుల కదలికలను నిత్యం గమనిస్తుంటారు. వారి ప్రతి కదలికను వీడియోలో రికార్డు చేస్తుంటారు. ఈ తరహా పార్టీలు గ్రేటర్‌లో 100 వరకు ఏర్పాటయ్యాయి. ఓటర్లను ప్రభావితం చేసేందుకు, బెదిరించేందుకు ఆస్కారం లేకుండా ఇలా చేశారు. ఆయా వ్యక్తులు ఎప్పుడు, ఎక్కడికి వెళ్తున్నది, ఎవరితో మాట్లాడుతున్నది గమనిస్తుంటారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేయడం వీరి విధి. పోలింగ్ నేపథ్యంలో డబ్బు, మద్యం పంపిణీలు జోరందకునే అవకాశం ఉండడంతో ఈ షాడో టీమ్స్ సంఖ్య పెంచాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు.
పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటలకు తావు లేకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పోలీసు సహా వివిధ విభాగాలు సమన్వయంతో పని చేస్తున్నాయి. పోలీసులతో పాటు ఎన్నికల కమిషన్ తరఫున మైక్రో అబ్జర్వర్లు సైతం నియమితులయ్యారు. వీరంతా పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఆయా బూత్‌లలో విధులు నిర్వర్తిస్తారు. మరోపక్క సమస్యాత్మ పోలింగ్ బూత్‌ల్లో 3200 వీడియో కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటికి తోడు నగర పోలీసులు మరో 2000 వీడియో, డిజిటల్ కెమెరాలు వినియోగిస్తున్నారు. సిబ్బందికి సెల్‌ఫోన్లు, వైర్‌లెస్ సెట్లు అందించారు. పికెట్లు, మొబైల్ పార్టీల్లో ఉండే ప్రతి ఒక్కరి దగ్గరా ఇవి అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. నగరంలోని అన్ని డిస్ట్రిబ్యూటింగ్ కేంద్రాల దగ్గరా బాంబు నిర్వీర్య బృందాలను మోహరించారు. నగదు, మద్యం పంపిణీకి ఏమాత్రం ఆస్కారం లేకుండా మంగళవారం ఉదయం నుంచి పోలింగ్ ముగిసే వరకు సోదాలు ముమ్మరం చేయనున్నారు. నగర వ్యాప్తంగా నిఘా, గస్తీ ముమ్మరం చేశారు.
దారికొస్తారా.. లోనికెళ్తారా..?
ఎన్నికల బందోబస్తు, భద్రతా ఏర్పాట్లలో భాగంగా రౌడీషీటర్లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. కొత్వాల్ అంజనీకుమార్ ఆదేశాల మేరకు నగరంలో ఉన్న రౌడీషీటర్లను బౌండోవర్ చేయడంతో పాటు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తున్నారు. దీన్ని డీసీపీ పి.రాధాకిషన్‌రావు, అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని పోలీసులు రౌడీషీటర్లను హెచ్చరించారు. కౌన్సెలింగ్ అనంతరం వీరిని బైండోవర్ చేశారు. రౌడీషీటర్లు, ఇతర అసాంఘిక శక్తుల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా తక్షణం స్థానిక, టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment