
సాక్షి, హైదరాబాద్: దేశంలో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రమవుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులపై కేసు లు, వేధింపులకు పాల్పడుతుండటమే ఇందుకు కారణమన్నారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలసి సురవరం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్, రమణ్‌సింగ్‌లపై ఉన్న సీబీఐ కేసులపై విచారణ చేపట్టకుండా, సోనియా, రాహుల్ గాంధీ, మాయావతి, అఖిలేశ్‌యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్‌లపై ఈడీ, ఐటీ, సీబీఐల ద్వారా రాజకీయ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. శారదా చిట్ ఫండ్ స్కాం, రోస్ వ్యాలీ కుంభకోణంలో సంబంధమున్న వారిని కాపాడేందుకు బీజేపీ, తృణమూల్ సాగిస్తున్న రాజకీయ పోరులో భాగంగానే ప్రస్తుత పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల పునర్ నిర్వచనకు వెంటనే అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త సీబీఐ చీఫ్ నియమితులైన రోజే ఇన్‌చార్జి డైరెక్టర్ నాగేశ్వరరావు కోల్‌కతా పోలీస్ కమిషనర్ అరెస్ట్‌కు ఎందుకు పూనుకున్నారు.. దీని వెనుక ఎవరున్నారో బయటపెట్టాలన్నారు.
జంగిల్ బచావో పేరుతో గరీబ్ హటావో: చాడ
అడవుల్లో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులు, ఇతరవర్గాల పేదలను జంగిల్ బచావో పేరుతో వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిని పట్టుకోవడం మాని పోడుపై బతికే బడుగులపై పోలీసులు దాడులకు పాల్పడటాన్ని ఖండిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి 53 రోజులు గడిచినా పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు చేయకపోవడం కేసీఆర్ అప్రజాస్వామిక విధానాలకు అద్దం పడుతోందని విమర్శిం చారు. అన్ని విధులు, అధికారాలు బదిలీ చేయ కుండా సీఎం తన గుప్పిట్లో పెట్టుకుని సర్పంచ్‌ల మెడపై కత్తి మాదిరిగా ఆంక్షలు పెట్టారన్నారు.