సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. ఫలితాల ట్రెండ్స్ క్షణక్షణానికి మారుతుండటం.. హంగ్ అసెంబ్లీ ఖాయమని తేలడంతో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు దాదాపు రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. గెలిచామన్న బీజేపీ ఆనందం అంతలోనే ఆవిరైనట్టు కనిపిస్తోంది.
కన్నడ రాజకీయాల్లో సంచలనం!
ఎట్టిపరిస్థితుల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఏకంగా ముఖ్యమంత్రి పదవిని జేడీఎస్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధపడింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ తాజాగా జేడీఎస్ అధినేత దేవెగౌడకు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి అప్పగించేందుకు సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. కుమారస్వామితో ఫోన్‌లో మాట్లాడి తమ నిర్ణయాన్ని తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆఫర్‌ను జేడీఎస్ అంగీకరించింది. మరికాసేపట్లో దేవెగౌడ నివాసానికి అశోక్ గెహ్లాట్.. గులాం నబీ ఆజాద్ వెళ్లనున్నారు. సాయంత్రం కాంగ్రెస్-జేడీఎస్ నేతలు గవర్నర్‌ను కలువనున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం కీలకంగా మారనుంది.
కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి..!
ప్రస్తుతమున్న ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే.. కాంగ్రెస్‌కు 77 స్థానాలు, జేడీఎస్‌కు 39 స్థానాలు ఆధిక్యంలో ఉంది. బీజేపీ 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా ముందంజలో ఉంది. కానీ ఆ పార్టీ మెజారిటీ మార్కుకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ సాయంతో బీజేపీకి అధికారం దక్కకుండా పావులు కదుపుతోంది. కాంగ్రెస్, జేడీఎస్ చేతులు కలిపితే.. సులుభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం కనిపిస్తుండటంతో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్-జేడీఎస్ చకచకా అడుగులు పడుతున్నాయి.
సంబరాల నుంచి తేరుకునేలోపే..!
సాధారణ మెజారిటీని సాధించామనుకొని సంబరాల్లో మునిగిపోయిన బీజేపీలో.. మారుతున్న ట్రెండ్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. మధ్యాహ్నం 11 గంటలవరకు వెలువడిన ట్రెండ్స్‌బట్టి బీజేపీ సులభంగా 115 స్థానాలకు పైగా గెలుపొందుతుందని తెలియడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. యడ్యూరప్ప నివాసం వద్ద సందడి నెలకొంది. కానీ, చాలా నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యాలు మారుతుండటంతో.. పరిస్థితి క్రమంగా ఉత్కంఠకు దారితీస్తోంది. ప్రస్తుతం అందుతున్న ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే బీజేపీ 104 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. మొత్తం 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ లెక్కన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 112 కానుంది. మరీ ఈ మెజారిటీ మార్క్‌కు బీజేపీ 8 స్థానాల దూరంలో ఉండటం బీజేపీ పెద్దలను ఆలోచనలో పడేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ కింగ్ మేకర్ కాదు.. ఏకంగా కింగ్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఏకంగా జేడీఎస్‌కు సీఎం పీఠం అప్పగించేందుకు సిద్ధపడింది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్ - ఇక్కడ క్లిక్ చేయండి
తుది ఫలితాలు వెలువడేలోపు ఏం జరుగుతోంది!
నిజానికి ఫలితాలకు సంబంధించి ఇంకా చాలా స్థానాల్లో కౌంటింగ్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. చాలా నియోజకవర్గాల్లో ఆధిక్యాలు 100, 200, 500 ఓట్లలోపు ఉండటంతో తుది ఫలితాలు వెలువడేలోపు.. ఏదైనా జరిగే అవకాశముందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆధిక్యాలు మారి.. కాంగ్రెస్ పార్టీ సీట్ల సంఖ్య పెరిగితే.. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోవచ్చు. అలా కాకుండా బీజేపీ సంఖ్య ఏ కొద్దిగా పెరిగినా.. ఆ పార్టీకి కూడా అవకాశముంటుందని భావిస్తున్నారు. మొత్తానికి మారుతున్న ట్రెండ్స్ కర్ణాటకలో రసవత్తరమైన రాజకీయాలకు తెరతీశాయి.
Comments
Please login to add a commentAdd a comment