
గెలుపు అందరికీ సాధ్యమవొచ్చు. కానీ అందరిలాంటి గెలుపు కాకుండా...ప్రత్యర్థి బిత్తరపోయేలా...ప్రజలు నిండైన మనసుతో దీవించినప్పుడు లభించే విజయం ఎంతో ప్రత్యేకమైంది. 2009 ఎన్నికల్లో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సరిగ్గా ఇలాంటి గెలుపునే అందుకున్నారు. ఐదేళ్ల పాలనలో ప్రగతి రథాన్ని పరుగులెత్తించిన ఆయన ‘అభివృద్ధి–సంక్షేమాన్ని’ ∙నమ్ముకుని రెండోసారి ఎన్నికల బరిలోకి దూకారు. ప్రత్యర్థులంతా ఏకమై కూటమి కట్టారు. సినీహీరో చిరంజీవి కొత్త పార్టీతో ముందుకు వచ్చారు. టీఆర్‌ఎస్–టీడీపీ ఒక్కటయ్యాయి. అయినా ‘కూటమి’ని ఎదురొడ్డి అచ్చంగా ప్రగతి పాలనతోనే మళ్లీ వైఎస్ అధికారంలోకి వచ్చారు.
పాలనపై పూర్తి పట్టును సాధించడంతో పాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశంలో ముందువరసలో నిలిచిన ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనదైన రికార్డ్‌ను నెలకొల్పారు. 2004–09 మధ్యకాలంలో రైతు సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతికి చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలనిచ్చాయి. బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థుల ఉన్నతవిద్యకు వీలు కల్పించే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం, నిరుపేదలకు ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందించే ‘ఆరోగ్యశ్రీ’ పథకాలతో పాటు ఆపత్కాలంలో ఆసుపత్రికి తరలించేందుకు ‘108’ ఉచిత అంబులెన్స్ సర్వీసు.. వైఎస్‌ను ప్రతి గుండెకు చేరువ చేశాయి. పెన్షన్లను గణనీయంగా పెంచారు. సంక్షేమ కార్యక్రమాలు ‘సంతృప్తస్థాయి’లో అందరికీ అందించేందుకు వైఎస్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేశారు.
ఎన్నికలపై వైఎస్ ముద్ర
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏపీలో జరిగిన తొలి ఎన్నికలివి. పూర్తిగా అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా అధికారంలో కొనసాగిన (2004లో గెలిచాక) డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలోనే మరోసారి 2009లో అసెంబ్లీ/లోక్‌సభ ఎన్నికలు జరగడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి. 2009 ఏప్రిల్/మే ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు సినీనటుడు కొణిదెల చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) ఏర్పడింది. ఈ ఎన్నికల్లో 18 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత (1972, 78) మొదటిసారి వరుసగా రెండు శాసనసభ ఎన్నికల్లో గెలిచి (2009లోనూ) అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరఫున 29 రోజుల వ్యవధిలో 170 నియోజకవర్గాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్వహించిన విస్తృత ప్రచారం మంచి ఫలితాలనిచ్చింది.
స్పీకర్, పీసీసీ చీఫ్ ఓటమి
మహాకూటమి ప్రభావం వల్ల తెలంగాణలో స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సహా పార్టీ ప్రముఖులు 14 మంది ఓటమిపాలయ్యారు. లోక్‌సత్తా పార్టీని ఏర్పాటు చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఎన్.జయప్రకాష్‌నారాయణ కూకట్‌పల్లి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగిన టి. దేవేందర్‌గౌడ్ తొలుత నవతెలంగాణ ప్రజాపార్టీని స్థాపించి, తర్వాత దానిని పీఆర్‌పీలో విలీనం చేశారు. 2009 ఎన్నికల్లో రెండుచోట్ల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో టీడీపీ టికెట్‌పై గెలిచి ఎ.రేవంత్‌రెడ్డి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా 300 మంది మహిళలు పోటీ చేస్తే, 34 మంది గెలుపొందారు.
కడపలో జగన్ తొలి విజయం
కడప నుంచి తొలిసారి పోటీచేసిన వైఎస్ కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి.. పాలెం శ్రీకాంత్‌రెడ్డి (టీడీపీ)ని ఓడించి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతర పరిణామాల నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి ఆ తరువాత ఉప ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి 5,45,672 ఓట్ల రికార్డు స్థాయి మెజారిటీతో జగన్‌మోహన్‌రెడ్డి గెలుపొందగా, వైఎస్ విజయమ్మ పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి 81,373 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
2009 లోక్‌సభ ఎన్నికల్లో పెరిగిన కాంగ్రెస్ బలం
15వ లోక్‌సభ (2009) ఎన్నికల్లో ఏపీలో చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు 33 సీట్లు వచ్చాయి. టీడీపీ మహా కూటమికి 8 సీట్లే దక్కాయి. తెలంగాణలోని 17 సీట్లలో కాంగ్రెస్ 12, టీడీపీ 2, టీఆర్‌ఎస్ 2 సీట్లు గెల్చుకున్నాయి. హైదరాబాద్‌లో ఎంఐఎం గెలిచింది. పీఆర్పీకి ఒక్క లోక్‌సభ సీటూ దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఆదిలాబాద్, ఖమ్మం సీట్లను కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం కైవసం చేసుకుంది. కేసీఆర్‌కు బదులు కరీంనగర్ నుంచి పోటీచేసిన బి.వినోద్‌కుమార్ (టీఆర్‌ఎస్)ను కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఓడించారు. అంతకుముందు మిర్యాలగూడ నుంచి గెలిచిన ఎస్.జైపాల్‌రెడ్డి (కాంగ్రెస్) చేవెళ్ల నుంచి విజయం సాధించారు. మెదక్‌లో మొదటిసారి టీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీచేసిన సినీనటి విజయశాంతి లోక్‌సభకు ఎన్నియ్యారు. టీఆర్‌ఎస్ నేత కేసీఆర్ మొదటిసారి మహబూబ్‌నగర్ నుంచి పోటీచేసి డి.విఠల్‌రావు (కాంగ్రెస్)ను ఓడించారు.
విఫలమైన మహాకూటమి
వైఎస్సార్ నాయకత్వంలో పటిష్టస్థితిలో ఉన్న కాంగ్రెస్‌ని ఎన్నికల్లో ఎదుర్కునేందుకు రాష్ట్ర విభజనను మొదట్లో వ్యతిరేకించిన టీడీపీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన టీఆర్‌ఎస్ జత కలిశాయి. అంతకు ముందున్న వైఖరికి భిన్నంగా తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించడంతో పాటు ఆ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చేందుకు టీడీపీ ఆమోదించింది. రాష్ట్రంలో కొన్నేళ్ల తర్వాత టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎంలతో మహాకూటమి ఏర్పడింది. అయినా ఈ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. గతంలో ఎన్టీరామారావు మాదిరిగా సినీ గ్లామర్‌తో రాష్ట్రంలో అధికార అందలం ఎక్కొచ్చని ఆశించిన చిరంజీవికి చుక్కెదురైంది. త్రిముఖ పోటీ వల్ల (కాంగ్రెస్, మహాకూటమి, పీఆర్‌పీ) టీడీపీ బలం 2004తో పోలిస్తే 41 నుంచి 92కు పెరిగింది.
అంజయ్య గారి జంబో కేబినెట్
అత్యధిక మంత్రులతో కేబినెట్‌ను ఏర్పాటు చేసిన రికార్డు ఇప్పటికీ మాజీ సీఎం టి.అంజయ్య పేరు మీదే కొనసాగుతోంది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 13 మంది మంత్రులతో కేబినెట్ ఏర్పాటు చేశారు. జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డిల హయాంలో కేబినెట్‌లో మంత్రుల సంఖ్య ముప్‌పై దాటిపోయింది. అయితే, 1980–82 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన టీ.అంజయ్య మాత్రం ఏకంగా 62 మందితో కేబినెట్ ఏర్పాటు చేశారు. ఇందులో బాగారెడ్డి, ఎన్.జనార్ధన్‌రెడ్డి, హయగ్రీవాచారి, జగన్నాథరావు, బాట్టం శ్రీరాంమూర్తి, రోశయ్య, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు తదితరులంతా మంత్రి పదవులు నిర్వహించారు. ఈ అత్యధిక మంత్రుల కేబినెట్ రికార్డు ఇప్పటికీ టి.అంజయ్య పేరుతోనే కొనసాగుతుండటం విశేషం.
తిరగాలంటే కష్టమే!
మంథని: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని నియోజకవర్గంలో ప్రచారం సాగించడమంటే మాటలు కాదు. ప్రస్తుత ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి తాను పోటీచేసే నియోజకవర్గంలోని ప్రాంతాలకు కనీసం రెండుసార్లైనా వెళ్లి ఓట్లు అడగాల్సిన పరిస్థితి.. దట్టమైన అటవీ ప్రాంతం, గిరిజన గ్రామాలు, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంగా పేరున్న మంథని నియోజకవర్గం విస్తీర్ణం రీత్యా అతి పెద్దది. ఏడు మండలాలు, దాదాపు మూడు వందల గ్రామాలు, 2.01 లక్షల ఓటర్లను కలిగిన ఈ నియోజకవర్గం, 180 కిలోమీటర్ల పొడవు, 40 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంది. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సబ్బితం వద్ద ప్రారంభమయ్యే మంథని నియోజకవర్గ పరిధి మహదేవ్‌పూర్ మండలంలోని చారిత్రాత్మక కట్టడమైన ఇచ్చంపల్లికి సమీపంలోని ముకునూరు వరకు విస్తరించి ఉంది. అక్కడక్కడా రవాణా మార్గం కూడా సరిగా లేని గ్రామాలు ఉండడంతో ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం కత్తిమీద సాములాంటిదే అని చెప్పొచ్చు. అందుకే ఈ నియోజకవర్గం నుంచి పోటీకి దిగే అభ్యర్థులు కాస్త ముందు నుంచే ప్రచారం ప్రారంభించడం పరిపాటి.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment