
గురి చూసి హామీ విసిరితే.. ఓటు పడాల్సిందే. ఇప్పుడు ఇదే టార్గెట్‌తో తెలంగాణలో రాజకీయ పార్టీలు ఓటర్లకు వల విసురుతున్నాయి. ఆకట్టుకునే హామీలతో ఓట్లు రాబట్టుకునేలా మేనిఫెస్టోలు రూపొందించి.. పండగ చేసుకోవాలని తలపోస్తున్నాయి.
ఏ పార్టీకి ఓటేయాలనే దానిపై ఓటరన్న మధనం రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. ప్రధాన రాజకీయ పక్షాలు పోటీలు పడి గుప్పిస్తున్న ఉచిత హామీలకు ఓటరన్న ఆకర్షితుడై మేనిఫెస్టోల ఆధారంగా తీర్పునిస్తాడా? రాజకీయ కారణాలు, విశ్లేషణలకే పట్టం కట్టి ఫలితాన్ని నిర్దేశిస్తాడా? రాజకీయ చైతన్యానికి మారుపేరైన ప్రజానీకం ఏ పార్టీ పల్లవితో తెలం‘గానం’కలుపుతారు? రాజకీయ పార్టీల అంచనాలు, ఆశలు ఎలా ఉన్నాయి? గులాబీ సెంటిమెంట్ గుబాళించేలా ఈవీఎంలు సవ్వడి చేస్తాయా? కూటమి కట్టిన పార్టీలకు గిట్టుబాటవుతుందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
హామీల పల్లకిలో...!
తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి జరుగుతున్న ఎన్నికలలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు హామీల మీద హామీలు గుప్పిస్తున్నాయి. ‘ఉచిత’ప్రకటనలతో ప్రజల హృదయాలను గెలిచే ప్రయత్నాలు చేస్తున్నాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తోంటే భారతీయ జనతా పార్టీ సైతం తానేం తక్కువ కాదంటోంది. నవంబరు 6న టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనుంది. ఇక, తేదీ ఖరారు కాకపోయినా కాంగ్రెస్, ఇతర పార్టీలు కూడా మేనిఫెస్టో తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ మేనిఫెస్టోలు చూసి ఓటరన్న మురిసిపోయి బ్యాలెట్ బాక్సులు నింపుతాడా అన్నది ప్రధానాంశం కానుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ, పింఛన్లు ఈసారి ఎన్నికలలో ప్రభావితం చూపుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ, ఉపాధి శిక్షణ లాంటి కార్యక్రమాల రూపకల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. చేనేతన్నలు, ఎంబీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తున్నాయి.
టీఆర్‌ఎస్ ఆశలు
- నాలుగేళ్లుగా రాష్ట్రంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు
- కేసీఆర్ ఛరిష్మా, ఉపన్యాసాలు
- ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్
- టీడీపీతో కాంగ్రెస్ కలిసిన నేపథ్యంలో మారిన రాజకీయ సమీకరణలు
- రైతు రుణమాఫీ, పింఛన్లు, రైతుబంధు వంటి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు
- ప్రతిపక్ష పార్టీల్లో నాయకత్వ లేమి
కూటమి ఊసులు
- టీఆర్‌ఎస్ హయాంలో అన్ని వర్గాలకు జరగని న్యాయం
- నిరుద్యోగులు, యువతలో అసహనం
- కొందరు టీఆర్‌ఎస్ సిట్టింగ్‌లపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి
- కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల సమన్వయం
- రైతు రుణమాఫీ, పింఛన్ పెంపు, ఉచిత రేషన్, ఉచిత విద్యుత్ హామీలు
- తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రచారం
- మేకల కల్యాణ్ చక్రవర్తి
Comments
Please login to add a commentAdd a comment